వర్ని, ఫిబ్రవరి 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. శిబిరంలో వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు గురువారం తనిఖీ చేశారు. శిబిరంలో ఇప్పటి వరకు ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారు, ఎన్ని కళ్లద్దాలు పంపిణీ చేశారు తదితర వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో విస్త్రృత ప్రచారం నిర్వహించి అర్హులైన వారికి 100 శాతం కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ విఠల్, ఎంపీవో చందర్ తదితరులు ఉన్నారు.
14,799 మందికి పరీక్షలు 1873 కళ్లద్దాలు పంపిణి
కామారెడ్డి/ ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 9: ఉమ్మడి జిల్లాలో గురువారం 14,799 మందికి నేత్ర పరీక్షలు చేసి, 1873 మందికి కళ్లద్దాలు అందజేశారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 5,622 మందికి పరీక్షలు నిర్వహించి 681 మందికి కంటి అద్దాలను అందజేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మణ్‌సింగ్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 76,835 మందికి పరీక్షలు నిర్వహించి 13,964 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 9,177 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 1,192 మందికి కంటి అద్దాలు అందజేసినట్లు డీఎంహెచ్‌వో సుదర్శనం తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,32,793 మందికి పరీక్షలు నిర్వహించి, 47,766 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.