సదాశివనగర్: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ (Sadashivanagar)మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ యువకుడు మృతిచెందారు. ఆదివారం ఉదయం సదాశివనగర్‌లో గోసంగి కాలనీకి చెందిన కళ్లెం సిద్ధిరాములు (17) కాలకృత్యాల నిమిత్తం గ్రామ శివార్లలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువు సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి మరణించారు. కాగా, తమ కుమారుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు వెతకగా.. బావి గట్టుపై చెప్పులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
గజ ఈతగాళ్ల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. సిద్ధిరాములు తండ్రి సంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.