కామారెడ్డి: నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. అయితే ఊర్లో ఎవరో అపరిచితులు తిరుగుతున్నారని గ్రామస్తులు వారిపై దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా రామారెడ్డి మండలం మద్దిగుంటలో చోటుచేసుకున్నది.
మద్దిగుంటకు చెందిన రమేశ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న రమేశ్.. అవి తిరిగి చెల్లించలేదు. దీంతో ఈ విషయమై భీమవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడిని పట్టుకునేందుకు ఏపీ పోలీసులు మఫ్టీలో మద్దిగుంటకు చేరుకున్నారు. అనుమానంతో గ్రామస్తులు వారిపై దాడికి యత్నించారు. రక్షణ కోసం వారు స్థానిక రామారెడ్డి పోలీసులను ఆశ్రయించారు.
