ఎమ్మెల్సీకి అన్నార్తుల దీవెనలు
నిరుపేదలకోసం నిత్యాన్నదానం
దాతృత్వం, సమాజసేవలో మేటి
నేడు కల్వకుంట్ల కవిత జన్మదినం
ఖలీల్‌వాడి, మార్చి 13 : ప్రజాసేవలో తనకు తానే సాటిగా నిలుస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రజాప్రతినిధిగా బాధ్యతలతో పాటు సేవాకార్యక్రమాలనూ కొనసాగిస్తున్న కవితను ఇందూరు ప్రజలు అభిమాన నేతగా గుండెల్లో పెట్టుకున్నారు. ఆకలిగొన్న కడుపులకు నిత్యాన్నదానాన్ని అందిస్తున్నారు. కష్టాల్లో ఎవరున్నా.. నేనున్నానంటూ వారికి భరోసానిస్తున్నారు. ఇతర దేశా ల్లో చిక్కుకున్నవారిని, గల్ఫ్ విగత జీవులను స్వగ్రామానికి చేరుస్తున్నారు.
ప్రజాసేవలో తనకు తానే సాటిగా నిలిచారు ఉమ్మడి ని జామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నో సేవా కార్యక్రమాలతో అందరి గుం డెల్లో స్థానాన్ని సంపాదించారు. నాయకురాలిగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడు తూ, అమ్మగా నిరుపేదలకు కడుపునిండా అన్నం పెడుతూ అన్నపూర్ణగా నిలుస్తున్నా రు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సేవలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న కవిత అంటే ఇందూరు ప్రజలకు ఎనలేని అభిమానం. అక్కగా ఆమె అందరినీ ఆదరించడం.. కష్టాల్లో నేనున్నానంటూ అక్కున చేర్చుకునే తీరు ఆమెకు ప్రత్యేక అభిమానాన్ని తెచ్చిపెట్టింది. ప్రభుత్వ దవాఖాన రూపురేఖలు మార్చడమే కాకుండా సౌకర్యాల కల్పనలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. రోగుల బంధువుల ఆకలి బాధలు గుర్తించి సొంత ఖర్చులతో నిత్యాన్నదానం ప్రారంభించారు.
కరోనా సమయంలో వైద్యులకు భోజన వసతి కల్పించారు. బంగారు తెలంగాణ కల సాకారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు తండ్రికి తగిన తయనగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ఇందూరుపై ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. నిరుపేదల ప్రాణాలకు భరోసా కల్పించే క్రమంలో వైద్య రంగానికి చికిత్స చేసి సర్కారు ఓ వైపు జవజీవాలను అందిస్తుండగా.. చికిత్స పొందుతున్న రోగుల తరఫు బంధువుల ఆకలి తీర్చుతూ కవిత వారి నుంచి ఆశీస్సులు పొందుతున్నారు. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ జనరల్ దవాఖానలో 2017 నవంబర్ 8న కవిత శ్రీకారం చుట్టారు. నేటికీ ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నది. ఇంతటితో ఆగకుండా బోధన్ జిల్లా దవాఖానలో 2018 ఏప్రిల్ 25న , ఆర్మూర్ ప్రభుత్వ వైద్యశాలలో 2018 జూలై 5న నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయంలో చదువుకొనే విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని 2019 జూలై 15 ప్రారంభించిన కవిత తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
కరోనా సమయంలో ఎనలేని సేవలు
కరోనా సమయంలో ప్రభుత్వ దవాఖానలో రోగుల కోసం ప్రత్యేకంగా రెమిడెసివర్ ఇంజక్షన్లను తెప్పించారు. ప్రభుత్వ దవాఖానలో అన్ని సదుపాయాలను కల్పించి ప్రజలకు అండగా నిలిచారు. అంతే కాకుండా ఇతర దేశాల్లో చిక్కుకున్న ఎంతోమందిని స్వదేశానికి రప్పించేందుకు చర్య లు తీసుకున్నారు. మన పండుగ అయిన బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తూ ప్రపంచ దేశాల్లో పండుగ ఖ్యాతిని పెంచారు.
నిరుపేదలకు అండగా..
రాజకీయాల్లో రాణిస్తున్న ఎమ్మెల్సీ కవిత సమాజ సేవలో తనవంతు పాత్రను పోషిస్తున్నారు. ఇందులో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జాగృతి ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాట పటిమను చాటిన కవిత జాగృతి సంస్థ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేశారు. తండ్రికి తగ్గ తనయురాలిగా ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
–అవంతిరావు, జాగృతి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
అక్క కోసం ఎంత చేసినా తక్కువనే
కవితక్క నిజామాబాద్‌లో ఉండడం దేవుడిచ్చిన వరం. ప్రజలకు నిత్యం సేవ చేయాలనే తపన తప్ప మరొకటి లేదు. అక్క కోసం ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా కొట్లాడే ఏకైక వ్యక్తి. నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఎంతో మందికి సహాయం చేసి అండగా నిలబడింది. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
–పబ్బ సాయి ప్రసాద్, టీఆర్ఎస్ యువ నాయకుడు
ఎమ్మెల్సీ పుట్టినరోజు ఆడియో సీడీ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ రచించి రూపొందించిన పాట సీడీని శనివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నుడా చైర్మర్ ప్రభాకర్‌రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఈ కాలం అన్నపూర్ణ, రుద్రమ అయిన కవిత పుట్టిన రోజును జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం సీడీని రూపొందించిన నరాల సుధాకర్‌ను అభినందించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ భరద్వాజ్, నుడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, పులి జైపాల్, శంకర్, హరీశ్ యాదవ్, మురళి,గోపాల్, ఆకాశ్ పాల్గొన్నారు.