నిజామాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం అమలులో వేగాన్ని పెంచారు. హుజూరాబాద్‌లో విజయవంతంగా అమలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రతి నియోజకవర్గంలో తొలుత 100 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో దళితబంధుపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నిజాంసాగర్‌లో ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధంచేశారు. ఇందుకు అవసరమైన రూ.50కోట్ల నిధులను కలెక్టర్ ఖాతాలో ప్రభుత్వం మంగళవారం జమ చేసింది. త్వరలోనే పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండడంతో అధికార యంత్రాంగం సైతం సిద్ధమవుతున్నది.
దళిత కుటుంబాలను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రణాళికను వేగంగా పట్టాలెక్కించబోతున్నారు. వేల కోట్లు ఖర్చు చేసైనా సరే గ్రామాల్లోని దళిత కుటుంబాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రణాళికపై అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. దళిత సాధికారతకు పాటుపడేలా డిజైన్ చేసిన పథకంపై గ్రామ స్థాయిలోనూ ఆయా కుటుంబాల నుంచి మంచి స్పందన వస్తున్నది. సీఎం నిర్ణయంపై అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దళితబంధు పథకంపై నాలుగైదు రోజుల క్రితం సీఎం కేసీఆర్ స్వయంగా స్పష్టమైన ప్రకటన చేయడంతో జిల్లా స్థాయిలో యంత్రాంగంలోనూ హడావుడి మొదలైంది. త్వరలోనే సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజల స్థితిగతులపై పూర్తిస్థాయి వివరాలను ఆరా తీస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సర్వేను పూర్తి చేశారు. నిజాంసాగర్ మండలంలో అర్హుల జాబితాను సిద్ధం చేశారు. త్వరలోనే దళితబంధు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల య్యే సూచనలు కనిపిస్తుండడంతో యంత్రాంగం అందుకు సిద్ధమైంది.
ఉమ్మడి జిల్లాలో నిజాంసాగర్ మండలం ఎంపిక…
దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయడం తో విజయవంతం అయ్యింది. ఈ అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని విస్తరించేందుకు సర్కా రు తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రాష్ర్టానికి నాలుగు దిక్కులా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను కేసీఆర్ ఎంపిక చేశారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి జుక్కల్ నియోజకవర్గానికి సీఎం ప్రాధాన్యతను ఇచ్చారు. నిజాంసాగర్ మండలాన్ని ఎంపిక చేయడంతో దాదాపు 5వేల మంది దళితులు నివసిస్తున్న ఈ మండలంలో పథకం అమలుకు గ్రౌం డ్ వర్క్ అంతా పూర్తయ్యింది. కుటుంబాల వారీగా ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రస్తుతం వారి జీవనాధారం, నెలవారీ ఆదాయం, వ్యవసాయ భూము లు, ఆస్తులు, కుటుంబ సభ్యుల సంఖ్య, విద్యాభ్యా సం వంటి వివరాలను సేకరించారు. ఏ గ్రామంలో ఎంత మంది జనాభా ఉన్నారు. దళిత కుటుంబా లు ఎన్ని ఉన్నాయానే వివరాలను క్రోడీకరించారు. నిజాంసాగర్ తరహాలోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ దళిత కుటుంబాలపై సమగ్ర వివరాలను ఆయా శాఖల అధికారులు సేకరిస్తున్నారు.
రూ.50 కోట్లు మంజూరు…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం వచ్చే కొద్ది రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తొలి దశలో 100 వంద కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు అందించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఈ పథకం గొప్పతనాన్ని ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు, దళిత ప్రజలకు తెలిసే విధంగా పైలట్ పథకం సై తం అమలు కాబోతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా జు క్కల్ నియోజకవర్గం నుంచి నిజాంసాగర్ మండలంలో పథకం అమలుకు ప్రభుత్వంశ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో నిజాంసాగర్‌లో దళిత కుటుంబాల జీవన స్థితిగతులపై క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయ్యింది. పథకం అమలుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను కామారెడ్డి జిల్లా యం త్రాంగం పూర్తి చేసింది. త్వరలోనే అట్టడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయా కుటుంబాలకు మేలు చేకూరనున్నది. అధికారుల గణాంకాల ప్రకారం 1800 దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింప చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిజాంసాగర్ మండలంలో దళితబంధు అమలు కోసం అక్టోబర్ 18న సర్కారు రూ.50కోట్లు మంజూరు చేసింది. మరిన్ని నిధులు కూడా త్వరలోనే రానున్నాయి.
కలెక్టర్ ఖాతాలోకి దళితబంధు నిధులు
నిజాంసాగర్, డిసెంబర్21: దళితబంధు పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ.250 కోట్లు జమ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ. 50 కోట్ల నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ. 100 కోట్లు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిర్మలగిరి మండలానికి రూ. 50 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలానికి రూ. 50 కోట్లు విడుదల చేశారు. నిజాంసాగర్ మండలంలో దళితబంధు అమలు కోసం రూ. 50 కోట్ల నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయడంతో దళిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.