Nizamabad | కంటేశ్వర్, ఆగస్టు 31 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం 6వ జిల్లాస్థాయి యోగా, ఆసన, క్రీడల పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నరసయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతోందని అన్నారు.
యువత యోగా క్రీడాంశాల్లో పాల్గొంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ సత్తాను చాటుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం యోగాకు ఓ ప్రత్యేక స్థానం కల్పిస్తూ భారతదేశం ప్రపంచ దేశాలకు సైతం యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశం ఉనికిని చాటి చెబుతోందని చెప్పారు. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు యోగారత్న ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు యోగా రామచందర్ మాట్లాడుతూ సమస్త మానవాళి యోగాద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చనే ఉద్దేశంతో ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రచారం చేయించి అందరి మన్ననలను పొందారన్నారు.
యోగా ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం తో పాటు ఎటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్త కుండా శరీరంలో ని సమస్త నాడులను ఉత్తేజపరిచేందుకు ఈ యోగాసనాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రతీ ఒక్కరూ నిత్యం యోగాసనాలను వేస్తూ తమదైనందిన జీవితాలను సుగమనం చేసుకోవాలని తెలియజేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగీత, సాయిలు, జిల్లా స్థాయి యోగా ఆసన క్రీడల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుండి విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.