గాంధారి, డిసెంబర్ 27: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ సామాజిక చేపట్టిన తనిఖీల నివేదికలపై మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం ప్రజావేదికను నిర్వహించారు. డీఆర్డీవో సాయన్న సమక్షంలో మండలంలోని అన్ని గ్రామాల్లో 2019 జూన్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన నివేదికలను గ్రామాల వారీగా డీఆర్పీలు చదివి వినిపించారు. మండలంలోని మాతు సంగెం, కరక్‌వాడి, సోమారంతండా, మేడిపల్లి, రాంలక్ష్మణ్‌పల్లి, మాధవపల్లి, సీతాయిపల్లి, గండివేట్తండా, గండివేట్, లొంకతండా, నేరల్, చెన్నాపూర్, సోమ్లానాయక్ తండా, పేట్ సంగెం గ్రామాల్లో కూలీలు చేపట్టిన పనులతో పాటు హాజరైన కూలీలు, అవెన్యూ ప్లాంటేషన్లలో నాటిన మొక్కలు, ప్రస్తుతం ఉన్న మొక్కల వివరాలను వెల్లడించారు. మిగితా గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల వివరాలపై బుధవారం ప్రజావేదిక ఉంటుందని ఈజీఎస్ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఎం రాంనారాయణ, ఎంపీపీ రాధా బలరాం, జడ్పీటీసీ శంకర్‌నాయక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సతీశ్, ఎంపీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, ఏపీవో హరిబాబు, ఆయా గ్రామాల సర్పంచులు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.