బోధన్, మార్చి 21: ఆదివారం తలెత్తిన విగ్రహ వివాదం తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల నుంచి బోధన్ పట్టణం క్రమంగా కోలుకుంటున్నది. సోమవారం పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. పట్టణంలో 144 సెక్షన్ విధించడంతో దుకాణా లు, హోటళ్లు, వ్యాపారసంస్థలను వ్యాపారులు మూసివేశారు. ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి. ఉదయం వేళ జనసంచారం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. క్రమేపీ మధ్యాహ్నంకల్లా రోడ్లపై జనసంచారం పెరిగింది. సోమవారం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొంది.
సోమవారం బోధన్ పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, పోలీస్ ఐజీ కమలహాసన్ రెడ్డి, సీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీ వినీత్, కామారెడ్డి, నిర్మల్ ఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, పలువురు సీఐలు సమీక్షించారు. పట్టణమంతటా పోలీస్ పికెట్లను ఏర్పాటుచేశారు. ప్రత్యేక బలగాలు పట్టణంలో కవాతు నిర్వహించాయి. గతంలో బోధన్‌లో పనిచేసిన పోలీస్ అధికారులకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడంతో.. వారిని సోమవారం ఇక్కడికి రప్పించారు. ఇక్కడ గతంలో పనిచేసిన కోదాడ డీఎస్పీ రఘు, వివిధ ప్రాంతాల్లో సీఐలుగా పనిచేస్తున్న వెంకన్న, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి, నాగార్జున్‌గౌడ్, అశోక్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు వచ్చారు. బోధన్ ఏసీపీ రామారావు, సీఐ ప్రేమ్‌కుమార్, రూరల్ సీఐ రవీందర్ నాయక్‌తో కలిసి వారు శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
15 మందికి రిమాండ్
శక్కర్‌నగర్/ రెంజల్/ వర్ని, మార్చి 21: ఆదివారం ఘ టనకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 15 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో రెండువందల మందిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రసరిహద్దులో తనిఖీలు
బోధన్ ఘటన నేపథ్యంలో సరిహద్దుల్లోనూ పోలీసులు కట్టదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు.మెట్పల్లి సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లూర్ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపడుతున్నట్లు ధర్మాబాద్ పోలీసులు తెలిపారు.వర్ని నుంచి బోధన్ వైపు వెళ్తున్న వాహనాలను ఎస్సై అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు.