దారుణానికి ఒడిగట్టిన ఎదురింటి యజమాని
రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్‌పై కర్రతో దాడి
అక్కడికక్కడే రాంప్రసాద్ మృతి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
నాలుగు రోజుల క్రితం ఖానాపూర్ బైపాస్ వద్ద ఘటన
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 28: ఇంటి ముందు ఉన్న రోడ్డు విషయంలో ఓ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్‌ను దారుణంగా హత్యచేయగా, నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ నగరశివారులోని ఖానాపూర్ బైపాస్ వద్ద చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ నాగరాజు సోమవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై లింబాద్రి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ కొక్కొండ రాంప్రసాద్(60) ఏడేండ్ల క్రితం ఖానాపూర్ గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇంటి ముందర ఉన్న ఎనిమిది అడుగుల రోడ్డు(స్థలం) విషయంలో ఎదురింటి యజమాని బోనిశెట్టి గంగమల్లుతో పలుమార్లు వివాదం నెలకొనేది. దీంతో కోపం పెంచుకున్న గంగమల్లు ఈ నెల 25వ తేదీన ఖానాపూర్ బైపాస్ రోడ్డులో రాంప్రసాద్ ఎదురుపడ్డారు. స్థలం విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరుగగా ఆవేశంతో గంగమల్లు కర్రతో రాంప్రసాద్ తల పై దాడి చేశాడు. దాడిలో రాంప్రసాద్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడని సీపీ వివరించారు. హత్యకేసు కింద గంగమల్లుపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్, రూరల్ ఎస్సై లింబాద్రి పాల్గొన్నారు.