కమ్మర్పల్లి, మే 10 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో 63వ నంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలు, వారి కూతురు మృతి చెందారు. మరో కూతురు తీవ్ర గాయాలతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నది. గ్రామంలో విషాదాన్ని నింపిన ఈ సంఘటనకు సంబంధించి కమ్మర్పల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మర్‌పల్లిలోని గొల్లపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన జాడి కిష్టయ్య(36) సోమవారం రాత్రి తన భార్య రజిత(33), కూతుళ్లు రాఘవి(12), శరణ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆర్మూర్‌కు బయలు దేరాడు. ఆర్మూర్ రోడ్డులో 63వ నంబరు జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకుకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది.
సంఘటనా స్థలంలోనే కిష్టయ్య మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న పెద్ద కూతురు రాఘవిని అంబులెన్సులో మోర్తాడ్ దవాఖానకు తరలిస్తుండగా కన్ను మూసింది. భార్య రజిత, శరణ్యను నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రజిత మృతి చెందింది. చిన్న కూతురు శరణ్య చికిత్స పొందుతున్నది. మృతురాలు రజి త సోదరుడు దుర్గం మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.మృతదేహాలకు ఆర్మూర్‌లో పోస్టుమార్టం నిర్వహించగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో ఇందిరమ్మ కాలనీలో విషాదం నెలకొంది. అందరినీ కంటతడి పెట్టించింది. వీరితో పాటు వా హనంపై వెళ్లాల్సిన కిష్టయ్య-రజితల కుమారుడు శివకుమార్ చివరి నిమిషంలో ఆగిపోయాడు. దవాఖానలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్న చిన్న కూతు రు శరణ్య, శివకుమార్ పరిస్థితిని తలుచుకొని స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. పేద కుటుంబానికి చెందిన కిష్టయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా, కూలీగా..భార్య రజిత కూలీగా పని చేసేవారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
సంఘటనా స్థలాన్ని మంగళవారం ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, భీమ్‌గల్ సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.
గుండె పగిలిన పండుటాకులు
మృతుడు కిష్టయ్య తల్లిదండ్రులు బుచ్చమ్మ, లింగయ్యల రోదన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. వీరి నలుగురు కుమారుల్లో రెండో కుమారుడైన కిష్టయ్య ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గతంలో మూడో కుమారుడు రవి తన నివాస గుడిసెలో విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డాడు. ప్రస్తుతం కోడలు, మనుమరాలు మృతి చెందారు. దీంతో వృద్ధ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
అండగా నిలిచిన టీఆర్ఎస్ నాయకులు
సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి స్థానిక సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, ఉప సర్పంచ్ పాలెపు గంగా రాం, నాయకులు జల్ల రాకేశ్ తదితరులు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అంత్యక్రియాల్లో పాల్గొని వారి కుటంబ సభ్యులు, బంధువులకు ధైర్యం చెప్పారు. సర్పంచ్ గడ్డం స్వామి గాయపడిన వారి వెంట దవాఖానకు వెళ్లారు. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఉండి వారి మృతదేహాలను గ్రామానికి తీసుకొని వచ్చారు.
రోడ్డు ప్రమాదంపై మంత్రి వేముల దిగ్భ్రాంతి
కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు మృతుల కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకుంటామని పేర్కొన్నారు.