నిజామాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఎండలు మండిపోతున్నాయి. అగ్ని గుండం మాదిరిగా వాతావరణం దగదగమంటున్నది. సూరీడు ప్రకోపానికి వడగాడ్పులు తోడవ్వడంతో బయటికి వెళ్లాలంటే జనాలంతా జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్ర ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించిన వాతావరణ వివరాల మేరకు శుక్రవారం(ఏప్రిల్ 29న) 45.1 ఉష్ణోగ్రతలు రికార్డు కావడం విశేషం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపుగా 30 డిగ్రీలకు చేరువవుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. మార్చి నెల ఆరంభంలో 40 డిగ్రీలకు చేరిన ఎండలు ఏప్రిల్ చివరి వారానికి ఊహించని విధంగా 45 డిగ్రీలకు చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8.30గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం 5గంటలైనప్పటికీ ఎండ సెగలు కక్కుతూనే ఉన్నది.
వారం రోజులుగా తలకిందులుగా…
గడిచిన వారం, పది రోజులుగా వాతావరణం హెచ్చుతగ్గులతో నమోదవుతున్నది. చెడగొట్టు వానలతో నాలుగైదు రోజుల క్రితం కాసింత ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగినట్లు అయ్యింది. అంతలోనే భానుడు ఎప్పటిలాగే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మబ్బులు, గాలివాన, ఉక్కబోత, ఎండవేడిమితోపాటు వడగండ్ల వానలతో జిల్లా వాసులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉంటున్నది. ఈ ప్రాంతా ల్లో 43 డిగ్రీలకు పైగా ఎండలు దంచి కొడుతున్నాయి. పగలు ఎండకు తోడుగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం మూలంగా ఉక్కబోత వాతావరణం భరించనివ్వడం లేదు. చాలా మంది ప్రజలు మధ్యాహ్నం పూట ఇండ్లకే పరిమితం అవుతున్నారు. వేడికి తాళలేక శీతల పానీయాలు సేవించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇంటి వాతావరణాన్ని చల్లబర్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కూలర్లు, ఏసీలు అమర్చుకుంటూ సేదతీరుతున్నారు. గతేడాదితో పోలిస్తే నిజామాబాద్ నగరంలో ఏసీ అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. చాలా చోట్ల పలు బ్రాండెడ్ ఏసీలకు చెందిన ఉత్పత్తులు స్టాక్ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు. ముందస్తు బుకింగ్‌లు సైతం కొనసాగుతుండడం విశేషం.
కోతల్లేకుండా విద్యుత్ సరఫరా..
దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతలతో సంక్షోభం ఆవరించింది. అనేక రాష్ర్టాల్లో కరెంట్ కటకటలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలంగాణలో మాత్రం పరిశ్రమలకు, గృహ అవసరాలకు, వ్యవసాయానికి ఎలాంటి కోతల్లేకుండానే కరెంట్ అందుతున్నది. వినియోగం అమాంతం పెరగడంతో సరఫరా చేయలేక పక్క రాష్ర్టా ల్లో గంటల కొద్దీ కోతలు విధిస్తున్నారు. అలాంటి దుస్థితి తెలంగాణలో మచ్చుకూ లేకపోవడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం రోజువారీ విద్యుత్ వినియోగ డిమాండ్ 12.70 మిలియన్ యూనిట్లు ఉంటున్నది. అందుకు తగ్గట్లుగానే సరఫరాను తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ తగు ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్తర తెలంగాణలో అందులో నిజామాబాద్, కామారెడ్డిలో రైతులు వరి పంటఅత్యధికంగా సాగు చేశారు. కోత దశకు చేరిన వరితో బోర్ల వాడకం తగ్గుముఖం పడుతుండడంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు కాసింత ఊరట దక్కుతున్నది. వ్యవసాయ వినియోగం క్రమంగా తగ్గుతుండడంతో వాణిజ్య, గృహ అవసరాల నుంచి వచ్చే డిమాండ్ పెరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను చేస్తూ సమన్వయం చేస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలయ్యే నాటికి ఎండల తీవ్రత తగ్గుతుందని తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఎన్పీడీసీఎల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్..
రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఈ మేరకు రాష్ట్ర ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ విడుదల చేసిన ముందస్తు ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రానున్న 72 గంటలు కూడా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29న ఈ సీజన్లోనే తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలోని సగభాగం అంటే ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో రెడ్ హెచ్చరికలు కొనసాగాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43.1 డిగ్రీ సెల్సియస్ నుంచి 45 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా శుక్రవారం జక్రాన్‌పల్లిలో నమోదైన ఉష్ణోగ్రతలను అతి తీవ్రమైన ఎండలుగా టీఎస్పీడీఎస్ పేర్కొన్నది. వచ్చే నాలుగైదు రోజులు ఆరెంజ్ హెచ్చరికల్లోనే ఉమ్మడి జిల్లా కొనసాగుతుంది. అక్కడక్కడ 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఎండలు ఠారెత్తించనున్నాయి.