బోధన్, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో హర్షం వ్యక్తమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు స్థానిక సంస్థలకు ప్రాతినిథ్యం వహించే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులకు అతి తక్కువ వేతనాలు ఉండేవి. ఈ వేతనాలు తమను అగౌరవపర్చేవిగా ఉన్నాయని అప్పట్లో వారు మధనపడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ 2015లో ఈ గౌరవ వేతనాలను ఒకేసారి భారీగా పెంచారు. ప్రస్తుతం అదనంగా మరో 30శాతం పెంచడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను 30శాతం మేరకు పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీ అధ్యక్షులకు ప్రస్తుతమున్న గౌరవ వేతనం రూ.10వేల నుంచి రూ.13వేలకు పెరిగింది. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులకు ఇప్పుడున్న రూ.5,000 వేతనాన్ని రూ.6,000కు పెంచారు. ఈ పెరిగిన వేతనాలు ఈ ఏడాది జూన్ నెల నుంచి అమల్లోకి వస్తాయి. ఈ గౌరవ వేతనాల పెంపుతో జిల్లాలో మొత్తం 854 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రయోజనం చేకూరనున్నది. నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటికి 27 మంది జడ్పీటీసీలు, 27 మంది ఎంపీపీ అధ్యక్షులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 27 మండలాల్లో మొత్తం 528 సర్పంచులు, 299 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరందరికీ పెరిగిన గౌరవ వేతనాలు ఎంతో ఊరటను ఇచ్చాయి. సీఎం కేసీఆర్ తమ గౌరవాన్ని పెంచారని వారంతా కృతజ్ఞతలు చెబుతున్నారు.
వేతనాలు పెంచడం ఇది రెండోసారి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారిగా 2015 జూన్ 24న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు గణనీయంగా పెంచారు. ఇప్పుడు రెండోసారి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ శాతం మేరకు వేతనాలు పెంచారో.. దానితో సమానంగా స్థానిక ప్రజాప్రతినిధులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2015 కన్నా ముందు జడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనం కేవలం రూ.2,250 మాత్రమే ఉండేది. ఇక, ఎంపీపీ అధ్యక్షులకైతే గౌరవ వేతనంగా రూ.1500 మాత్రమే ఇచ్చేవారు. ఇంత తక్కువ గౌరవవేతనాలు ఇవ్వడమంటే వారిని అవమానించడమేనని భావించిన సీఎం కేసీఆర్.. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షుల వేతనాలను ఒకేసారి రూ.10వేలకు పెంచడం గమనార్హం. ఇప్పుడు మరో 30శాతం పెంచడంతో వీరి గౌరవ వేతనం రూ.13వేలకు పెరిగింది. 2015 కన్నా ముందు ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం రూ.750గా ఉండేది. మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచులకు రూ.1500, మైనర్ గ్రామ పంచాయతీల సర్పంచులకు రూ.1000 గౌరవ వేతనం ఉండేది. 2015లో వీరి వేతనాలను ఒకేసారి రూ.5000కు పెంచారు. ఇప్పుడు మరో 30శాతం కలుపడంతో వీరి గౌరవ వేతనాలు రూ.6,500కు పెరిగాయి. ఇప్పటికే, స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను పుష్కలంగా ఇస్తున్నది. దీంతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాయి. మరోపక్క ఎంపీటీసీలకు సరైన గౌరవం ఇచ్చే దిశగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషిచేస్తున్న విషయం తెలిసిందే.
గొప్ప నిర్ణయం..
మా ఎంపీపీలతోపాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంచుతూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంతో పాలనా వ్యవహారాల్లో చొరవచూపేందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్ణయం ఉంది.
-బుద్దె సావిత్రి రాజేశ్వర్, ఎంపీపీ, బోధన్
స్థానిక సంస్థల బలోపేతం దిశగా..
స్థానిక సంస్థలను పటిష్టం చేసేందుకు, గ్రామస్థాయిలో పాలన సవ్యంగా సాగేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచడం హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ గౌరవ వేతనాల పెంపుతో ప్రజాప్రతినిధుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ప్రభుత్వం తమను గుర్తించిందన్న సంతోషంతో వారు మున్ముందు ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత భాగస్వాములు అయ్యే అవకాశమున్నది. సీఎం కేసీఆర్‌కు మా స్థానిక ప్రజాప్రతినిధులందరి తరఫున కృతజ్ఞతలు.
ఎంపీటీసీల గౌరవం పెరిగింది..
జడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు మా గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం ఎంతో సంతోషకరం. వాస్తవానికి గౌరవ వేతనం పెంచారనేదానికన్నా మా గౌరవాన్ని పెంచారని భావిస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలు పెరగలేదు. ఒక్క కేసీఆర్‌తోనే ఇది సాధ్యమయ్యింది. ఇందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-చందుల హన్మంతు, ఎంపీటీసీ, సంగం, బోధన్ మండలం