వరద ఉధృతితో గోదావరి భీతిని గొల్పుతున్నది. మంజీర ప్రమాదకర స్థాయిలో పోటెత్తుతున్నది. రెండు నదుల సంగమస్థలిలో వరద మహోధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువనుంచి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో మంజీరానది ప్రవహిస్తుండగా, మహారాష్ట్ర నుంచి గోదావరికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతున్నది. రెండూ కలిసి ఎస్సారెస్పీకి చేరేసరికి ఐదులక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. అటు మంజీర వరదప్రవాహానికి, గోదావరి బ్యాక్‌వాటర్ తోడవడంతో సమీప మండలాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నది. మంజీరలోకి గోదావరి జలాలు ఎదురెక్కడంతో పరీవాహక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కందకుర్తి- ధర్మాబాద్ మధ్యనున్న అంతర్రాష్ట్ర వంతెన పూర్తిగా నీటమునిగింది. సాలూరా బ్రిడ్జిదీ ఇదే పరిస్థితి. బోధన్ మండలంలోని హంగర్గా, బిక్నెల్లి గ్రామాలు, నవీపేట మండలంలోని అల్జాపూర్ గ్రామం పూర్తిగా వరదలో చిక్కుకున్నాయి. తెప్పలపై వెళ్లిన అధికారులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : జీవనది గోదావరి తీరం భయానకంగా మారింది. నది తన రూపాన్ని మార్చుకుని ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న ది. ఎప్పుడూ శాంతంగా కనిపించే గోదావరి రెండు రోజులుగా తీవ్ర రూపంలో దర్శనమిస్తోంది. అతి భారీ వర్షాలతో మహారాష్ట్ర, తెలంగాణలో వరద పోటెత్తుతుండడంతో నదుల్లో ప్రవాహం తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండున్నర దశాబ్దాల క్రితం కనిపించిన పరిస్థితులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కనిపిస్తున్నాయి. రెండు నదుల్లోనూ వరద ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో వస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో రెడ్ అల ర్ట్ ప్రకటించి సహాయక చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ వరదను నియంత్రించేందుకు ప్రాజెక్టుల నుంచి ఔట్ ఫ్లో ను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. కొన్ని గంటల వ్యవధిలో పోచంపాడ్ ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీలు మేర నీళ్లు దిగువకు వదిలారు. గులాబ్ తుఫాన్ సృ ష్టించిన బీభత్సంతో గోదావరి, మంజీరా నదుల్లో మూడు రోజులుగా రికార్డు స్థాయి వరద కొనసాగుతుండడం విశేషం.
మంజీర ముంచెత్తగా…
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే సహజంగానే గోదావరి నది జలకళతో ఉట్టిపడుతుంది. వానకాలం సీజన్ ఆరం భం అనంతరం జూలై 1వ తారీఖు నుంచి బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో గోదావరి నీళ్లతో కనిపిస్తున్నది. 2021 సీజన్లో భారీ వర్షాలతో నాలుగు నెలలుగా జీవనది ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నది. రికార్డు స్థా యిలో ప్రమాదకరమైన ప్రవాహంతో అందరినీ హడలెత్తిస్తున్నది. గులాబ్ తుఫాన్ కారణంగా కుండపోత వానలతో గోదావరి నది మరోమారు సెప్టెంబర్ 27 వ తారీఖు నుంచి ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 3 నుంచి 4లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో పరుగులు తీ స్తోంది. దీనికి తోడు ఈ సంవత్సరం మంజీర నది సైతం తీవ్ర స్థాయిలో ప్రవాహం అందుకుంటున్నది. మహారాష్ట్రలో భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నిండింది. గేట్లు ఎత్తడంతో మంజీర ప్రవాహం నిజాంసాగర్‌కు చేరుకుని అక్కడి నుంచి కందకుర్తికి లక్ష క్యూసెక్కులతో తరలివ స్తున్నది. మంజీరలో భారీ ప్రవాహం కందకుర్తి వద్ద గో దావరిలో కలుస్తుండగా సంగమ క్షేత్రం భయానకంగా మారింది. ఒక దశలో మంజీర నుంచి వస్తోన్న వరద నీటి కి ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తోడవ్వడంతో ఉపనదిలోకి జీవనది జలాలు ఎదురెక్కడంతో ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండున్నర దశాబ్దాల తర్వాత…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తుఫాన్ కారణంగా ఏర్పడిన వరద పరిస్థితి సరిగ్గా రెండున్నర దశాబ్దాల క్రితం కనిపించింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా జక్రాన్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి మండలాలు నిలవడంతో పాటు పలు ప్రాంతాల్లో చెరువులు, రోడ్లు తెగిపోవడం వంటి విపత్కర పరిస్థితులు కొద్ది సంవత్సరాలుగా వెలుగు చూడలేదు. మంజీరా నదిని ఆనుకుని ఉన్న బోధన్ మండలంలోని హంగర్గా గ్రామాన్ని వరద చుట్టేసింది. బిక్నెల్లి గ్రామం సైతం వరద ముప్పును ఎదుర్కొంది. కందకుర్తి గ్రామం సైతం త్రివేణి సంగమాల మూ లంగా వరద నీటితో పోటెత్తింది. కందకుర్తి చెంత గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి దాదాపు అర కిలో మీ టర్ వరకు విస్తరించి భూ ఉపరితలానికి ఆనుకుని ప్రవహించడం కనిపించింది.
మంత్రి వేముల నిరంతర సమీక్ష…
గోదావరి, మంజీర నదుల్లో కొనసాగుతున్న భారీ వరదలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అధికారి యం త్రాంగం అప్రమత్తమైంది. నదులను ఆనుకుని ఉన్న గ్రా మాల్లో ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు ముందస్తు చ ర్యలు తీసుకున్నారు. వరద రాకను దృష్టిలో పెట్టుకుని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. పరీవాహక ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులతో రోజంతా సంప్రదింపులు జరిపారు. నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి, బోధన్, రెంజల్ మండలాల్లో పరిస్థితులపైనా వివరాలు ఆరా తీసి ఉన్నతాధికారులకు సలహాలు, సూచనలు అందించారు.
మొదటిసారి చూస్తున్నా..
వర్షాకాలంలో ఎగువన నుంచి వచ్చే నీరు చేరడంతో గోదావరి నది పొంగి ప్రవహించినా మరుసాటి రోజు సాధారణ స్థితికి చేరేది. ఈ నెలలోనే రెండు దఫాలు వరదల రూపంలో వచ్చిన నీరు మూడు రోజుల పాటు ఊరు చుట్టూ ఉండడంమొదటి సారి చూస్తున్నా.
చేతికొచ్చిన పంట నష్టపోయా
వ్యవసాయంపై అధారపడిన నాకు వరదతో తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట నీటిపాలయ్యింది. సాగు చేసేందుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండాపోయింది. వరద నీటితో గ్రామమంతా అతలాకుతలమైంది. ఇంత వరద ఎప్పుడూ చూడలేదు.
-షబ్బీర్బేగ్, రైతు, కందకుర్తి