అమ్మవారి దారు శిల్పం
సీమచింత కలపతో తయారు చేయించిన భక్తుడు వడ్ల శ్రీనివాస్
నవరాత్రి ఉత్సవాల కోసం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన భక్తుడు వడ్ల శ్రీనివాస్ రూ. 2.5 లక్షలతో అమ్మవారి దారుశిల్పాన్ని తయారు చేయించాడు. ఏటా సొంత ఖర్చుతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తాడు. ఈ ఏడాది ప్రత్యేకంగా తమిళనాడులోని సేలం గ్రామంలో సీమచింత కలపతో ఏడున్నర అడుగుల భారీ విగ్రహాన్ని తయారుచేయించాడు. దుర్గా యూత్ సభ్యులతో కలిసి గురువారం విగ్రహాన్ని శోభాయాత్రగా తీసుకువచ్చి ఉప్లూర్‌లోని లలితా పరమేశ్వరీ ఆలయంలో ప్రతిష్ఠించారు.
రంగ్ రంగ్.. తరంగ్!
ఖలీల్‌వాడి, అక్టోబర్ 7: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఫెస్ట్ సంబురాలు అంబరాన్ని అంటాయి. గురువారం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన తరంగ్ కార్యక్రమం అందరినీ అలరించింది. కలర్‌ఫుల్ డ్రెస్సులతో ఫ్యాషన్ షో నిర్వహించారు. బతుకమ్మతో పూల పండుగ, నవదుర్గ అవతారాల్లో నృత్య ప్రదర్శన అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, డీటీసీ వెంకటరమణ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యులు ప్రత్యక్ష దేవుళ్లని అన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టి సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఇందిర, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, వైద్యులు పాల్గొన్నారు.
బోధన్‌లో సద్దుల సంబురం
బోధన్, అక్టోబర్ 7: బోధన్ పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ మిగతా ప్రాంతాలకు భిన్నంగా కేవలం మూడు రోజుల పాటే సంబురాలు నిర్వహిస్తుండగా, అమావాస్య మర్నాడు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగిశాయి. బతుకమ్మ సంబురాల సందర్భంగా పట్టణంలోని బోధన్, రాకాసీపేట్ ప్రాంతాలు సాయంత్రం నుంచి సందడిగా కనిపించాయి. బతుకమ్మ ఆడిపాడిన అనంతరం పట్టణ శివారులోని చెక్కి చెరువు, పాండు చెరువు, బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేశారు. పోస్టాఫీస్ ప్రాంతంలో ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఆర్టీసీని త్వరలోనే లాభాల బాటాలోకి తెస్తాం
చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
డిచ్పల్లి, అక్టోబర్ 7 : రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ నష్టాల్లో ఉన్నవిషయం అందరికీ తెలిసిన విషయమేనని, సంస్థను త్వరలోనే లాభాల బాటలోకి తెస్తామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన సంస్థ పరిస్థితిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లో సుమారు 48 వేల కుటుంబాలకు చెందిన కార్మికులు, అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచడంతో ఆర్టీసీ ఆదాయం మరింత పడిపోయిందని చెప్పారు. సంస్థకు ప్రతిరోజూ రూ. 15 కోట్ల మేర నష్టం వస్తున్నదని వివరించారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చి కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మంచి టీమ్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. సంస్థ బాగుకోసం సీఎం తమతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలను అందజేశారని తెలిపారు. తనను చైర్మన్‌గా నియమించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కార్గో సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, అక్టోబర్ 7 : లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సమయంలో సీఎం కేసీఆర్ కొత్త ఆలోచనతో ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో సేవలను అందుబాటులోకి తెచ్చారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. కార్గో సేవలను గ్రామీణ ప్రాంతలవారికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సమయంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ. 1500 కోట్లు, బడ్జెటేతర నిధులు రూ. 1500 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. కార్గో సేవల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ. 62 కోట్ల లాభం వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పట్టణాలకే పరిమితమైన కార్గో సేవలను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి డెలివరీ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు.
పురాతన ఆలయాలపై ప్రత్యేక దృష్టిసారించాలి
ఎమ్మెల్సీ వీజీ గౌడ్
డిచ్పల్లి, అక్టోబర్ 7: శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ వీజీగౌడ్ గురువారం మాట్లాడారు. పురాతన ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. కాకతీయుల కాలంలో నిర్మించిన నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లా డిచ్పల్లి రామాలయానికి దాదాపు 700 ఏండ్ల చరిత్ర ఉందన్నారు. సిర్నాపల్లి సంస్థానం వారు నిర్మించిన ఇందల్వాయి సీతారామాలయానికి 300 ఏండ్ల చరిత్ర ఉన్నట్లు వివరించారు. ఈ రెండు ఆలయాలను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ వైపు నుంచి బాసర క్షేత్రానికి వచ్చే భక్తులు దర్శించుకుంటారని అన్నారు. ఆలయాల అభివృద్ధికోసం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఇప్పటికే ప్రతిపాదలను పంపించామని తెలిపారు. ఇందుకు సమాధానంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. నిధులు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవిస్తామని తెలిపారు.