గాంధారి మండలం కొత్తబాదితండాలో టాస్క్‌ఫోర్స్ దాడులు
గాంధారి, అక్టోబర్ 5: మక్కజొన్న చేనులో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. మండలంలోని కొత్తబాది తండా శివారులోని 113 సర్వే నంబర్లోని అసైన్డ్ భూమిలో దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో గుర్తు తెలియని వ్యక్తులు మక్కజొన్న పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారనే సమాచారంతో సోమవారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఏపుగా పెరిగిన మక్కజొన్న, కంది పంటల మధ్యలో ఎవరికి కనిపించకుండా సాగు చేస్తున్న పదివేల గంజాయి మొక్కలను మంగళవారం ఎక్సైజ్‌శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సిబ్బందితో కలిసి తొలగించారు. తహసీల్దార్ గోవర్ధన్ సమక్షంలో పంచనామా చేసి వాటిని తగులబెట్టారు. గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సదాశివనగర్ సీఐ వెంకట్ తెలిపారు. ఈ దాడిలో గాంధారి ఎస్సై శంకర్, ఎక్సైజ్‌శాఖ ఎస్సైలు రాధిక, జలీలొద్దీన్, ఆర్ఐ నర్సింహారెడ్డితో పాటు ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.