ఆయన పేరు చెబితేనే పచ్చదనం గుర్తుకు వస్తుంది. మొక్కల పెంపకం.. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న హరితహారానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు రావుట్ల జనార్దన్. ఇప్పటికే లక్షలాది మొక్కలను నాటడమే కాకుండా ఇతరులతో నాటించేలా కృషిచేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారాయన. రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా చైతన్యపరుస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన రావుట్ల జనార్ధన్ పచ్చదనాన్ని తన ఇంటిపేరుగా మార్చుకుని ‘గ్రీన్ జనార్దన్’గా సుపరిచితులయ్యారు.
ఇందూరు, అక్టోబర్ 5 : ఆయన వేషధారణ చూస్తే చిన్న పిల్లలకు సైతం అర్థమవుతుంది ఆయనో ప్రకృతి ప్రేమికుడని.. ఆయన వేసుకునే దుస్తులు, వాడే ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ కవర్ ఇలా ఒక్కటేమిటి చివరకు పెన్ను, హి యర్ ఫోన్స్ సైతం ఆకుపచ్చ రంగువే వాడుతారు. దీన్ని బట్టి పచ్చదనం, పర్యావరణంపై ఆయనకు ఉన్న మక్కువ ఏపాటిదో చెప్పకనే చెబుతుంది. మొక్కలంటే ఆయనకు ప్రాణం. ప్రతి ఏటా వేలాది మొక్కలను నాటి సంరక్షణ బాధ్యతను తీసుకుంటాడు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తన వంతుగా ప్రభుత్వానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు రావుట్ల జనార్దన్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఒక్క మొక్కతో ప్రారంభించిన కార్యక్రమం హరిత ఉద్యమంలా లక్షలాది మొక్కలను నాటి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూనే పర్యావరణాన్ని రక్షించడం బాధ్యతగా భావిస్తాడు. నాయకులు, అధికారులు శుభకార్యాలయాలకు వెళ్లినప్పుడు మొక్కలను బహుమతిగా ఇస్తాడు. సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన రావుట్ల జనార్దన్ గ్రీన్ జనార్దన్‌గా పేరుగాంచాడు. పీజీ వరకు చదివిన ఆయన 9 సంవత్సరాలు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా చేశారు. 2002లో నిజామాబాద్ సిరివెన్నెల ప్రింటింగ్ ప్రెస్‌ను ప్రారంభించి నిజామాబాద్‌లో స్థిరపడ్డారు. 2009 డిసెంబర్లో ఆయన హరిత ఉద్యమాన్ని ప్రారంభించారు. లక్షలాది మొక్కలను నాటించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
జయహో పచ్చదనం
చేటు చేయబోకు చేయ జనుము మేలు
మొక్క నాటి చూడు ఒక్కటైన
రక్ష చేయు నిన్ను రానున్న కాలాన
వినుము కవన ఘనుని విమల కవిత
చినుకు చినుకు కురియ చిగురించి వృక్షమ్మ
మొక్క నాటు భాయి యొక్కటైన
చినుకు చెట్లు భువికి చిరసంపదలనిచ్చు
వినుము కవన ఘనుని విమల కవిత
రావి చెట్టు నీడ రాజసింహాసనం
వేపగాలి తీర్చు వేల వెతలు
అవనిలోని చెట్లు అక్షయ పాత్రలు
వినుము కవన ఘనుని విమల కవిత
పచ్చనైన చెట్టు మెచ్చు కోరదెపుడు
అనవరతము నొసగు ఆమ్లజనిని
కీర్తి కోరువారు ఆర్తి వీడవలయు
వినుము కవన ఘనుని విమల కవిత
హరితహార మనగ చరిత శ్రీకారమ్మ
కేసియారు రచన చేసినారు
మనదు భూమి పచ్చదనమై మెరిసిపోయె
వినుము కవన ఘనుని విమల కవిత
మొక్కలు నాటడంపై అవగాహన కల్పిస్తూ…
తాను మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుంటాడు. తీరిక వేళల్లో వెళ్లి వాటి ఆలనాపాలనా చూస్తాడు. వృక్షాలు వాటి గొప్పతనం, వాటి ద్వారా కలిగే లాభాల గురించి విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తాడు. నగరంలోని ప్రెసిడెన్సీ, బీబీసీ, చైతన్య, విజయ్, వివేకానంద, వీఎన్ఆర్ స్కూల్, బోర్గాం, గూపన్పల్లి, కాలూర్ ప్రభుత్వ పాఠశాలతో పాటు జిల్లా కేంద్రంలోని 70 స్కూళ్లల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో డిచ్పల్లి, ధర్పల్లి, మోపాల్, ఇందల్వాయి, సిరికొండ, జక్రాన్‌పల్లి, మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణం గురించి అవగాహన కల్పించారు.
పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది..
ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటే సరిపోదు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గుర్తించాలి. ప్రతి వ్యక్తి తమ వంతుగా మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్నది. మనిషి మనుగడ సాఫీగా సాగాలంటే మొక్కలను పెంచాలి. కాలుష్యాన్ని పెంచే ఎలక్ట్రికల్, ప్లాస్టిక్ వస్తువుల వాడకం వీలైనంత వరకు తగ్గించాలి. మొక్కలను పెంచాలని కోరిక ఉండి సమయం లేదు అనుకునే వారు తిన్న అన్ని రకాల పండ్ల గింజలను సేకరించి మాకు 9441154199 కు ఫోన్ చేస్తే వచ్చి వాటిని తీసుకెళ్లి అడవుల్లో చల్లుతాం.
-రావుట్ల జనార్దన్
మొక్కల పెంపకం, కార్యక్రమాలు..
అడవుల్లో ఇప్పటి వరకు 2,25,000 విత్తన బంతులు చల్లాడు. 2010లో మొదటిసారిగా నిజామాబాద్‌లో మట్టి గణపతులను పంపిణీ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 10వేలకు పైగా మట్టి గణపతులు పంపిణీ చేశారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలియజేసే 24 పేజీల పుస్తకాన్ని రాసి ఇప్పటి వరకు తొమ్మిది వేల పుస్తకాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ లక్షకు పైగా కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై గుంటూరులో 11 రోజులు పాటు శిక్షణ తీసుకొని జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 2010 ఆగస్టు, సెప్టెంబర్‌లో కాలూర్, ఖానాపూర్ పరిధిలో ఉన్న 25 రైస్‌మిల్లుల్లో 2వేల మొక్కలు నాటారు. జనార్దన్‌కు మొక్కలపై మమకారాన్ని, తన సేవలను గుర్తించిన అన్నా హజారే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధి గ్రామంలో తన ఇంటికి పిలిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
సేవలకు గుర్తింపు