ఖలీల్‌వాడి, అక్టోబర్ 4: నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దిగువ, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా చూడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె శాసనమండలిలో పలు అంశాలను ప్రస్తావించారు. ఇందులోభాగంగా హౌసింగ్ బోర్డు అంశాన్ని ప్రస్తావిస్తూ పేద ప్రజలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హౌసింగ్ బోర్డు ఇప్పటివరకు ప్రైవేట్ స్థలాన్ని సేకరించి అనంతరం ఆర్థికంగా దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఇచ్చేదన్నారు. అయితే ప్రభుత్వానికి భూములు ఇచ్చిన యజమానులు తరచూ కోర్టులకు వెళ్లడం, ధరల పెరుగుదలతో రూ. 18 కోట్లు అదనపు భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికే ఈ సమస్యను అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. ఆర్థిక భారాన్ని మాఫీ చేసేలా ఏదైనా పరిష్కారం చూపాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కోరారు. స్పందించిన మంత్రి వేముల ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.