హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అడవులకు పూర్వవైభవం తీసుకురావాలని పరితపిస్తూనే, ఆ దిశగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. మంకీఫుడ్ కోర్టులు, పల్లె ప్రకృతివనాలతో పచ్చదనానికి ఊతమిస్తున్నది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఊరూరా నర్సరీలను ఏర్పాటుచేసి, మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మొక్కలు నాటడంపై లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు ఎవరైనా వాటిని ధ్వంసం చేస్తే జరిమానాలను సైతం విధించేలా పంచాయతీలకు అధికారాలను అప్పగించింది. మొక్కల సంరక్షణను సామాజిక బాధ్యతగా మలిచేందుకు సీఎం కేసీఆర్ హరితనిధిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు తోడుగా.. ప్రజల భాగస్వామ్యం పెంచడం కోసం చిన్నపాటి మొత్తాలతో హరిత నిధికి విరాళాలు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. అడవులకు పూర్వ వైభవం తీసుకురావాలని పరితపిస్తోంది. హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నర్సరీలు ఏర్పాటు చేయించింది. అక్కడి నుంచి మొ క్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటిస్తున్నది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ వాటిని సంరక్షించే వారు అక్కడక్కడ కరువవుతున్నారు. ఫలితంగా బృహత్ లక్ష్యంతో అమలవుతున్న హరితహారంలోని మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ దుస్థితిని పోగొట్టేందుకు మొక్కల సంరక్షణను సామాజిక బాధ్యతగా మలిచేందుకు సీఎం కేసీఆర్ ఆలోచించారు. హరిత నిధి ఏర్పాటుతో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. తోచినంత డబ్బును హరిత నిధికి డొనేట్ చేసేలా ప్రోత్సహించి హరితహారం కార్యక్రమం విశిష్టతను సమాజంలో విస్తరింపజేసేందుకు ప్రభు త్వం కంకణం కట్టుకున్నది. ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కు తోడుగా ప్రజల భాగస్వామ్యం పెంచ డం కోసం చిన్నపాటి మొత్తాలతో హరిత నిధికి విరాళాలు ఇచ్చేలా ఏర్పాటు జరుగుతున్నది. మొక్క ల పెంపకంపై ఇప్పటికే ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుండగా నిధి మూలంగా మరింత బాధ్యత పెరుగనున్నది.
గ్రీన్ చాలెంజ్ మాదిరిగానే గ్రీన్ ఫండ్
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉధృతంగా సాగుతున్నది. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెట్టిన హరితహారం స్ఫూర్తితో ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చిన్న పాయలా మొదలై నేడు నదీ ప్రవాహంలా విస్తరించింది. హరితహారం సాధనకు నిచ్చెనగా గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన వృక్షార్చన కార్యక్రమాలు కొత్త రకం ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. అభిమాన నాయకుడికి తెలంగాణ ప్రజలంతా మొక్కలను కానుకగా అందించి అభిమానాన్ని చాటుకోవడం ద్వారా వినూత్నమైన సంప్రదాయం ప్రజల్లో అలవాటైంది. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ర్టానికి దేశ వ్యాప్త కీర్తి సంపాదించడంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉపయోగ పడింది. ఒక వ్యక్తి ఓ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి హరిత సవాల్ విసరడం, ఆ ముగ్గురు మూడేసి మొక్క లు నాటి… మరింత మందికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసరడం ద్వారా చైన్ మాదిరిగా అల్లుకుపోయింది. గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు అదనంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన గ్రీన్ ఫండ్ పిలుపునకు విశేషమైన స్పందన వస్తున్నది.
భావితరాల కోసం..
తరిగిపోతున్న అడవులను 33శాతానికి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహా రం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఏడో విడుత హరితహారం విజయవంతంగా పూర్తయ్యింది. నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాల్లో 530 గ్రామ పంచాయతీలో ఒక్కో జీపీలో వేలాది మొక్కలను నాటారు. అటవీ భూములు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, రహదారులు, పొలం, కాలువగట్లు, ఆలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కల ను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ కనీసం ఆరు మొక్కలు పంపిణీ చేసి ప్రజల్లోనూ చైతన్యం కల్పించారు. ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో మొక్కలు నాటేలా ప్రోత్సహించారు. గ్రామాల్లో నాటిన మొక్కలను పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించే విషయంలో పర్యవేక్షణ పకడ్బందీగా చేపట్టారు. నాటిన మొక్కలను ఎవరైనా తొలగిస్తే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు అవుతున్నాయి. వ్యవసాయ భూముల్లో, మరే ఇతర ప్రాంతా ల్లో గానీ నాటిన మొక్కలను తొలిగించినా, కాల్చి వేసినా అలాంటి వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలను ప్రభుత్వం జారీ చేసింది. మొక్కల పెంపకం అన్నది సామాజిక బాధ్యత. అడవులను రక్షించుకుంటేనే, కొత్తగా వనాలను పెంచుకుంటేనే భావితరాలు బతుకుతాయి. లేదంటే మానవ సమాజానికి భవిష్యత్తు ఉండదు అనే సందేశాన్ని ప్రభుత్వం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది.
గ్రీన్ బడ్జెట్‌తో సర్కారు తోడ్పాటు..
ఒకప్పుడు గ్రామాలు పచ్చని తోరణంతో కనిపించేవి. ఊరూ, వాడ ఆకుపచ్చని వనంలా దర్శనం ఇచ్చేది. పల్లెలపైనా ఆధునిక పోకడల ప్రభావంతో రోజురోజుకూ గ్రామాలు కుచించుకు పోయాయి. సహజ వనరుల దోపిడి, రహదారుల విస్తరణ, నూతన హంగులతో నిర్మాణాలు వంటి కారణాలతో ఏపుగా పెరిగిన చెట్లు, వనాలు అంతరించి పోతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో మొక్కల సంరక్షణ అన్నది తెలంగాణ రాష్ట్రం రాక ముందు వరకు క్లిష్టమైన పనిగానే కనిపించింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా మొక్కలను నాటితే అదే గొప్పగా ఫీలయ్యే పరిస్థితి ఎదురైంది. కానిప్పుడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలో భాగంగా భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని హరితహారం కార్యక్రమానికి సంకల్పించారు. చెట్లు ఉంటే క్షేమం… లేకుంటే క్షామం అన్న సూత్రాన్ని ప్రజల్లోకి కొంగొత్తగా తీసుకు పోయారు. చెట్లు నాటాలంటూ తనదైన శైలిలో సీఎం కేసీఆర్ చైతన్య పరిచారు. అలా మొదలైన హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పుడు గ్రామాల్లో ఉద్యమంగా మారింది. నిధులు లేక వెలవెలబోయిన పంచాయతీలకు తెలంగాణ సర్కారు నెల వారీగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తోంది. అందులో 10శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయింపులు జరగడం ద్వారా పాలకవర్గాలకు మొక్కల పెంపకం, సంరక్షణ సులువుగా మారింది.
ప్రకృతి అందాల ‘కోట’గిరి!
కోటగిరి మండలం పచ్చని అందాలకు నెలవుగా మారింది. మండలంలోని గ్రామాలు పచ్చదనంతో పరవశింపజేస్తున్నాయి. యాద్గార్పూర్, దోమలెడ్గి, కల్లూర్, కొడిచెర్ల, బస్వాపూర్ ప్రాంతాలు కోనసీమ అందాలను గుర్తుకు తెస్తున్నాయి. కనుచూపు మేరలో పంట పొలాలు, వాటి మధ్య ఏపుగా పెరిగిన కొబ్బరి, తాటి వనాలు, నిండుకుండల్లా చెరువులు, పల్లె అందాలు ఆహాదాన్ని పంచుతున్నాయి.