ఖలీల్‌వాడి, అక్టోబర్ 2: అనారోగ్యం ఆ పేద కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీకి చెందిన లక్ష్మి-గంగాధర్ దంపతులకు కొడుకు శ్రీనివాస్(34), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లక్ష్మి ఇంటిపట్టున ఉండగా గంగాధర్ బయట వంట పనిచేస్తున్నాడు. కొడుకు శ్రీనివాస్‌కు పదేండ్ల క్రితం కామారెడ్డికి చెందిన వనజతో వివాహం చేశారు. శ్రీనివాస్ ప్రైవేట్‌లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి కుమారుడు అక్షయ్‌కుమార్ (9), కూతురు సహస్ర (7) ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో గతేడాది శ్రీనివాస్ ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డాడు. దవాఖానకు వెళ్లి చూపించుకోగా, రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు తెలిపారు. కిడ్నీ మార్పిడి కోసం రూ.14లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో శ్రీనివాస్ మానసికంగా కుంగిపోయాడు. ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో చెల్లెలు సుజాత ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అన్నకు అండగా నిలుస్తోంది. అయినప్పటికీ మందుల కోసం నెలకు రూ.20 వేల వరకు ఖర్చుకావడంతో బాధితుడు శ్రీనివాస్ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. దాతలు ఎవరైనా శ్రీనివాస్ మొబై ల్ నంబర్ 9346475762కు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నా కుటుంబాన్ని ఆదుకోండి ..
ఒక్కసారిగా నా జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దాతలు ముందుకు వచ్చి నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రతినెలా దవాఖాన మందుల కోసం సుమారు రూ.20 వేల వరకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దయచేసి ఆపరేషన్ కోసం నాకు ఆర్థికసాయం చేసి పునర్జన్మనివ్వాలని కోరుతున్నా.
-శ్రీనివాస్, బాధితుడు