మెండోరా, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 1500 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు ఆరు వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నదని వివరించారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి 532.786 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1090.90 అడుగుల (89.763 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ పేర్కొన్నారు.
నిజాంసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్/ నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 3: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువప్రాంతం నుంచి 57,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు డీఈఈ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఐదు వరద గేట్ల ద్వారా 45700 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రానికి ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1404.75 అడుగుల (17.44 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1597 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి 1757 క్యూసెక్కుల నీరు పొంగి ప్రవహిస్తున్నట్లు ఆయన తెలిపారు.