సత్వర పరిష్కారం
24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ
సైబర్ మోసాలకు ముకుతాడు వేస్తున్న పోలీసులు
టోల్ ఫ్రీ నంబర్లు : 100, 155260
సైబర్ మోసగాళ్ల నుంచి మోసపోయారా? ఫోన్ చేసి మీ బ్యాంకులో ఉన్న సొమ్మును కాజేశారా? ఇది జరిగి కొన్ని గంటలు అయ్యిందా? అయితే వెంటనే మీరు చేయాల్సింది ఒకటే 100, 155260లకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడం. సైబర్ నేరం చేసినవారు తేరుకునేలోపే వారి ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాను లాక్ చేసి మీరు మోసపోయిన మొత్తాన్ని 24గంటల్లోనే మీకు అందించే అవకాశముంది.
సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోయిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే రంగంలోకి దిగుతున్నారు పోలీసులు. సైబర్ నేరస్తుల ఖాతాలను వెంటనే నిలిపివేసి బ్యాంకు ద్వారా డబ్బులు తీసుకోకుండా చేసి, బాధితులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభించారు. ఇదివరకు బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక, ఎవరికీ చెప్పుకోలేకపోయేవారు. ఇక అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సైబర్‌నేరాలు, సైబర్ ఫైనాన్సియల్ నేరాలపై టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టింది.
సైబర్ మోసగాళ్లకు ఆన్లైన్ అడ్డా..
సైబర్ మోసాలకు ఆన్లైన్ అడ్డాగా మారింది. మోసాలు ఎక్కువగా ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారిని టార్గెట్ చేసుకుని మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని.. లక్కీ డ్రాలో మీ పేరు ఎంపికైందని నమ్మించి నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఇటీవల వినాయక్‌నగర్‌లో నివాసముండే ప్రవీణ్‌కు ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు మీరు కారు గెలుచుకున్నారు… గెలుచుకున్న మొత్తం మీ సొంతం కావాలంటే వెంటనే రూ.17,500 చెల్లిస్తే ప్రాసెస్ పూర్తవుతుందని చెప్పారు. విషయాన్ని పసిగట్టిన ప్రవీణ్ గెలుచుకున్న మొత్తం పంపించాకే ప్రాసెసింగ్ చార్జీలు చెల్లిస్తానని చెప్పేలోగా ఫోన్ కట్ చేశారు. మరికొందరు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ వివరాలు తెలపాలని చెప్పి అకౌంట్లో ఉన్న మొత్తాన్ని లూటీ చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
నిజామాబాద్ కమిషనరేట్‌లోని 2వ టౌన్ పరిధిలో ఆన్లైన్ ద్వారా జాబ్ ఇప్పిస్తానని చెప్పిన మోసగాడు రూ.3లక్షల వసూలు చేసి ఉడాయించాడు. 4వ టౌన్ పరిధిలో ఇద్దరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.50వేల నుంచి లక్ష వరకు మోసపోయారు. ఆధార్ కేవైసీ అప్డేట్ చేస్తున్నట్లు వచ్చిన మెసేజ్ లింక్‌ను ఓపెన్ చేయగా సుమారు లక్ష వరకు డబ్బులు మాయమయ్యాయి. ఈ విషయంపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే అతని ఖాతాల్లోకి తిరిగి జమ చేశారు.
లింక్‌లను క్లిక్ చేయొద్దు
అనుమానాస్పదంగా వచ్చే మెసేజ్‌లు, ఫోన్ నంబర్ల నుంచి జాగ్రత్తగా ఉండాలి. కొత్త నంబర్ నుంచి, వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరస్తుల నుంచి మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 100, 155260 నంబర్లకు ఫోన్ చేయాలి. ఏటీఎం పిన్ నంబర్లను, ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు. 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న మొత్తం వెనక్కి వచ్చే అవకాశముంది.