నిజాంసాగర్/ లింగంపేట, అక్టోబర్ 2 : నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన శనివారం గ్రామసభలను నిర్వహించారు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జమాఖర్చులను పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులపై చర్చించి తీర్మానించారు. ధూప్సింగ్తండాలో నిర్వహించిన గ్రామసభలో మండల పంచాయతీ అధికారి అబ్బాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన శనివారం గ్రామసభలు నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని తీర్మానించారు. కూలీలకు పనులు కల్పించడానికి చేపట్టాల్సిన పనులను గుర్తించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ కూలి సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు అధికారులను కోరారు. గ్రామసభల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కచ్చితంగా ఉండాలి
నాగిరెడ్డిపేట్/ పిట్లం, అక్టోబర్ 2 : ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కచ్చితంగా ఉండాలని ఎంపీడీవో రఘు అన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారంలో శనివారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించారు. బంజారా తండా, గోపాల్‌పేట్‌లో నిర్వహించిన గ్రామసభల్లో ఎంపీవో శ్రీనివాస్ పాల్గొని సర్పంచులకు పలు సూచనలు చేశారు.
పిట్లం మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధిహామీ పథకం పనులపై సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. పిట్లంలో నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధిహామీ పనులు చేపడతామన్నారు. సమావేశంలో ఉపసర్పంచ్ ఇబ్రహీం, పంచాయతీ కార్యదర్శి విఠల్‌రెడ్డి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులకు తీర్మానాలు
బాన్సువాడ/దోమకొండ, అక్టోబర్ 2 : బాన్సువాడ మండలంలోని కొల్లూర్, నాగారం, మొగులన్పల్లి తండా, కొత్తబాది, ఇబ్రహీంపేట్‌లో శనివారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. గ్రామాలకు మంజూరైన నిధులు, చేపట్టే పనులపై గ్రామస్తులతో చర్చించి తీర్మానాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్రెడ్డి, సర్పంచ్ బండారి తుకారం, మాలెపు నారాయణ రెడ్డి, సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో సీపీఎం నాయకులు ప్రభుత్వ స్థలాల కబ్జాపై నిలదీశారు.