ఆర్థికాభివృద్ధిలో సెర్ప్ మహిళా సంఘాలు ప్రగతి సాధిస్తున్నాయి. సెర్ప్ సంఘాలకు బ్యాంకు రుణాల పంపిణీ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో చురుగ్గా కొనసాగుతున్నది. ప్రభుత్వ నిర్దేశం మేరకు లక్ష్యం దిశగా బ్యాంకర్లు రుణాల పంపిణీని చేపడుతున్నారు. కరోనా మహమ్మారితో రెండేండ్లు గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ సమయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ లక్ష్యం దిశగా సాగుతుండడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు రుణాల పంపిణీ లక్ష్యం రూ.831 కోట్లు కాగా, ఇప్పటి వరకు47 శాతం పంపిణీ పూర్తయ్యింది. జిల్లాలోని 21,817 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ రుణాలను సకాలంలో పంపిణీ జరిగేలా అధికారులు కార్యాచరణను రూపొందించి అమలు చేయిస్తున్నారు.
కమ్మర్పల్లి, అక్టోబర్ 2: జిల్లాలో సెర్ప్ మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల పంపిణీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నది.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి, అధికారులు నిర్దేశించిన ప్రకారం పంపిణీ లక్ష్యం దిశగా కొనసాగుతున్నది. రెండేండ్లు కరోనాతో గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన వ్యాపారాలు కోలుకుంటున్న తరుణమిది. ఈ సమయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ లక్ష్యం దిశగా సాగుతుండడం మహిళా సంఘాలకు మేలు చేసే ఆంశం. జిల్లాలో ఇప్పటికే 47 శాతం పంపిణీ పూర్తయ్యింది. ఇప్పటి వరకు రూ.394 కోట్ల రుణాలను పంపిణీ(రుణాల డబ్బుల పంపిణీ పరంగా)తో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నది. శనివారం నాటికి కమ్మర్పల్లి మండలం రుణాల పంపిణీలో జిల్లాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లా, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన కమ్మర్పల్లి మండలం ఈ సారి సైతం అదే తరహాలో ముందంజలో కొనసాగుతుండడం విశేషం.
జిల్లా లక్ష్యం
జిల్లాలో రుణాల లక్ష్యం ఆశించిన విధంగా సాగుతున్నది.2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల పంపిణీ లక్ష్యం రూ.831 కోట్లు. జిల్లాలోని 21, 817 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ రుణాలను సకాలంలో పంపిణీ జరిగేలా కార్యాచరణను రూపొందించి అమలు చేయిస్తున్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈ మేరకు జిల్లాలో సెర్ప్ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ రుణాల పంపిణీ లక్ష్యం మేరకు జరిగేలా సెర్ప్ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. దీంతో ఆర్థిక సంవత్సరం సగం ముగియ వస్తున్న దశలో శనివారం నాటికి వచ్చిన 8, 848 సంఘాలకు రూ.394 కోట్ల పంపిణీ పూర్తయ్యింది. తద్వారా రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతున్నది.
మొదటి స్థానంలో కమ్మర్పల్లి
రుణాల పంపిణీ లక్ష్యాన్ని జిల్లా వ్యాప్తంగా సెర్ప్ సిబ్బంది సకాలంలో పూర్తి లక్ష్యంగా పని చేస్తున్నారు.ఈ క్రమంలో కమ్మర్పల్లి మండలం శనివారం నాటికి జిల్లాలో ముందంజలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 889 మహిళా సంఘాలకు గాను రూ.40 కోట్ల రుణాలు పంపిణీ చేయడం లక్ష్యం. శనివారం నాటికి 601 సంఘాలకు రూ.37 కోట్ల రుణాల పంపిణీ పూర్తి చేశారు. దీంతో కమ్మర్పల్ల మండలం 93 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. మోస్రా మండలం రూ.5.87 కోట్ల లక్ష్యానికి గాను రూ.4.60 కోట్లు పంపిణీ చేసి 92 శాతంతో రెండో స్థానంలో, మోర్తాడ్ మండలం రూ.26 కోట్ల లక్ష్యానికి గాను 16 కోట్లు పంపిణీ చేసి 61 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాయి. నిజామాబాద్ జిల్లాలో రుణాల పంపిణీ చక చకా సాగుతున్నది. శనివారం నాటికి నాటికి నిజామాబాద్ జిల్లా రూ.394 కోట్ల పంపిణీతో మొదటి స్థానంలో కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లా గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలోనే అధికంగా రుణాలను అందించి ప్రథమ స్థానంలో నిలిచింది.ఈ సీజన్లోనూ అదే తరహాలో ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ లక్ష్యం దిశగా సాగుతుండడం మహిళా సంఘాల వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడనున్నది. సంఘాల సభ్యులకు సీసీఎల్ రుణ విధాన అవకాశం వచ్చాక రుణాల వినియోగంపై మహిళల్లో మరింత ఆసక్తి పెరిగింది. రుణ సౌకర్యం మొత్తం పెరగడంతో పాత రుణాలను చెల్లించిన వెంటనే వ్యాపార అవసరాలకు మరి కొంత అవసరమైన రుణాన్ని పొందే అవకాశం సీసీఎల్తో కలిగింది. తమ వ్యాపారాలకు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటున్న తరుణంలో రెండు సంవత్సరాలు కొవిడ్ మహమ్మారి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి, వ్యాపార రంగాలను కుదేలు చేసింది. ఇప్పుడు క్రమంగా పూర్వ స్థితి కనిపిస్తుండడంతో తమ వ్యాపారాల పై మహిళలు పూర్తి స్థాయిలో దృష్టి నిలిపే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రుణాల పంపిణీలో ముందంజలో సాగడడంపై మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది.