మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ముంపు గ్రామాలు మెల్లగా తేరుకుంటున్నాయి. వరద ధాటికి రెంజల్ మండలంలో కందకుర్తి-ధర్మాబాద్ ప్రధాన రహదారి ఇలా మిగిలింది.
రెంజల్/బోధన్ రూరల్, అక్టోబర్ 2 : గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో గోదావరికి వరద పోటెత్తింది. ఎగువన కురిసిన వానలకు మహారాష్ట్రలోని పలు ప్రాజెక్టుల గేట్లను కూడా ఎత్తడంతో మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతం ఊహించని ముంపునకు గురైంది. గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. నదిపై వంతెనలు మునిగిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఐదురోజులుగా ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రస్తుతం వరద ప్రవాహం కొంత తగ్గడంతో ఏమేరకు నష్టం వాటిల్లిందో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది.
రెంజల్ మండలంలోని ధర్మాబాద్ – కందకుర్తి ప్రధాన ఫోర్‌లైన్ రోడ్డు కందకుర్తి వంతెన వద్ద నుంచి సుమారు అర కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. వాహనాలను శనివారం బెల్లూర్ వైపు నుంచి అనుమతించకుండా ధర్మాబాద్ పోలీసులు రాక పోకలను నిలిపివేశారు. ఇప్పటికీ కందకుర్తి వద్ద అంతర్రాష్ట వంతెనను తాకతూ నీరు ప్రవహిస్తున్నది. మునిగిన పంటలు ఇసుక మేటల రూపంలో క్రమంగా బయటపడుతున్నాయి. ధ్వంసమైన ప్రధాన రహదారికి మరమ్మతు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. బోధన్ మండలంలోని సాలూరా వద్ద అంతర్రాష్ట్ర పురాతన వంతెనకు సమాంతరంగా మంజీరా నది ప్రవహిస్తున్నది.