అట్టహాసంగా విద్యాసంస్థల పునఃప్రారంభం
పాఠశాలల వద్ద సందడి వాతావరణం
నిజామాబాద్ సిటీ/ విద్యానగర్, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బుధవారం అట్టహాసంగా పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలకు విద్యార్థులు రావడంతో పలు చోట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు చప్పట్లు కొడుతూ, పూలు చల్లుతూ స్వాగతం పలికారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ లోనికి పంపించారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి రోజు 18శాతం విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1,38,194 మంది విద్యార్థులుండగా మొదటి రోజు 25,312 మంది హాజరయ్యారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న 1017 ప్రభుత్వ పాఠశాలల్లో 84,152 మంది విద్యార్థులకు మొదటిరోజు 25,720 మంది హాజరయ్యారు. హాజరు శాతం 30.56గా నమోదైంది. 175 ప్రైవేటు పాఠశాలల్లో 44,613 మంది విద్యార్థులుండగా 5536 మంది హాజరయ్యారు. పలు పాఠశాలలను జిల్లాస్థాయి అధికారులు తనిఖీ చేశారు. విద్యార్థులు మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించేలా చూడాలని ఆదేశించారు.