యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించింది. తక్షణ అనుమతులతోపాటు రాయితీలు ఇస్తూ మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు జూట్ పరిశ్రమలు తరలివస్తున్నాయి. మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డనిరంజన్రెడ్డి,గంగుల కమలాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, గ్లోస్టర్ లిమిటెడ్ ఎంబీజీ కమోడిటీస్ కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుపై ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. సదాశివనగర్ మండలంలోని లింగంపల్లిలో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ రూ.303 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుండగా.. దీంతో స్థానికంగా 3600 మందికి ఉపాధి లభించనున్నది. అంతేకాకుండా జూట్ పరిశ్రమల ఏర్పాటుతో జనపనార సాగు విస్తీర్ణం జిల్లాలో గణనీయంగా పెరుగనున్నది.
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 30 : కామారెడ్డి జిల్లాకు పరిశ్రమలు వరుస కట్టాయి.జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నా యి. ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో జ్యూట్ పరిశ్రమ స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరిశ్రమ స్థాపన కోసం ఇటీవల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ సంక్షేమ, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎమ్మెల్యే సురేందర్ సమక్షంలో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, గ్లోస్టర్ లిమిటెడ్ ఎంబీజీ కమాడిటీస్ కంపెనీల వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకు సంబంధిత శాఖ అధికారులు స్థల సేకరణ పనులు ప్రారంభించినట్లు సమాచారం. భూ సేకరణతో పాటు పనులు ప్రారంభించడానికి అధికారులు ప్ర ణాళికలు రూపొందిస్తున్నారు. జ్యూట్ పరిశ్రమ ఏర్పాటు కోసం కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ వారు రూ.303 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందు కు వచ్చారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన సుమారు 3600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేసిన కృషి ఫలించింది.
పరిశ్రమల ఏర్పాటుపై గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ఉద్యమ సమయంలో ప్రకటించిన సీఎం కేసీఆర్ ఒక్కక్కటిగా అమలు చేస్తున్నారు.
కలిసివచ్చిన జాతీయ రహదారి
జ్యూట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న లింగంపల్లి గ్రామానికి జాతీయ రహదారి సమీపంలో ఉండ డం కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. జాతీ య ర హదారికి పక్కనే ఉండడంతో రవాణా సౌకర్యం సు లభంగా మారింది. 44వ జాతీయ రహదారి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మీదుగా కశ్మీర్ వరకు విస్తరించి ఉంది. అలాగే మండలంలో నుంచి రైల్వే మార్గం సైతం ఉడడంతో కలిసి వచ్చే అంశంగా మారింది. ఉత్పత్తులను సులువుగా ఎగుమతి చేసే అవకాశం కలిగింది. ఉత్పత్తి చేసిన వస్తువులు జాతీ య రహదారితో పాటు రైల్వే మార్గం కలిగి ఉండ డంతో రవాణాకు ఇబ్బందులు లేని అంశంగా మారింది.
పెరగనున్న సాగు విస్తీర్ణం
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జ్యూట్ పరిశ్రమ స్థాపించడం తో పంటల సాగు విస్తీర్ణం పెరగనున్నది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం శిథిల దశకు చేరిన చెరువులు, కుంటలకు మహర్దశ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పథకం అమలు చేసి చెరువులను పూర్తి స్థాయిలో మరమ్మతలు చేసింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఆయకట్టు కింద సాగు పెరగడంతో పాటు పంట పెట్టుబడి పథకం అమలు చేయడంతో బీడు భూములు కనిపించకుండా పోయా యి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. కాళేశ్వరం జలాలు రావడంతో నియోజకవర్గంలో సాగునీటికి కొరత లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తుండడంతో రైతులకు పంట మార్పిడికి అవకాశం కలిసివస్తున్నది. ప్రస్తు తం లక్షా 35వేల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. జ్యూట్ పరిశ్రమ ఏర్పాటుతో పంట మార్పిడి చేపట్టి జనపనార సాగు చేసుకునే అవకాశం కలుగుతుంది. జనపనార సాగు చేయడంతో రైతులకు లాభం చేకూరుతుంది.
యువతకు ఉపాధి అవకాశాలు
నియోజకవర్గంలో జ్యూట్ పరిశ్రమ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. గత ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటుకు అలోచన సైతం చేయకపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయా యి. ప్రస్తుతం జ్యూట్ పరిశ్రమ ఏర్పాటుతో జనపనార సాగు పెరిగే అవకాశం కలుగుతుంది. పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
-జాజాల సురేందర్, ఎమ్మెల్యే ఎల్లారెడ్డి.
స్థానికంగానే ఉపాధి
లింగంపల్లి గ్రామంలో జ్యూట్ పరిశ్రమ ఏర్పాటుతో యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్థాయి. ఉన్నత చదువులు చదివిన వారు ఉపాధి కో సం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం కలుగుతుంది. గతంలో మాదిరిగా పట్టణాలకు వెళ్లాల్సి అవసరం ఉండదు.
-సూర్ల ధనుంజయ్, గాంధారి
స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి
గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జ్యూట్ పరిశ్రమలో స్థానికులకు అవకాశం కల్పించాలి. పరిశ్రమ ఏర్పాటుకు భూములు అందించిన రైతుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్నత చదువులు చదివిన యు వత ఉన్నారు. నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలి. -అమృతరాజేందర్రావు, లింగంపల్లి