నేలను సహజ పద్ధతిలో సారవంతం చేసేందుకు వానపాములు (ఎరలు) ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే వానపాములను రైతుమిత్రులుగా చెప్పవచ్చు. వానపాము సహజంగా తేమ ఉండే నేలల్లో బొరియలు చేసుకొని భూమిలోని సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని సారవంతమైన మట్టిని విసర్జిస్తాయి. ఈ విసర్జిత పదార్థమే వర్మీ కంపోస్టు. పంటలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రైతులకు పురుగుమందు అవసరాన్ని తగ్గించే ఈ వర్మీ కంపోస్టు తయారీపై కథనం..
వర్మీ కంపోస్టు బెడ్లు తయారు చేసే విధానం
కంపోస్టు తయారీ సమయంలో బెడ్లో 30-40 శాతం తేమ ఉండాలి. ఎండాకాలంలో రోజుకు రెండుసార్లు వానకాలంలో రోజుకు ఒక్కసారి బెడ్‌పై నీళ్లు చల్లాలి. వానపాములను వదిలిన తర్వాత రోజుకు ఒకసారి బెడ్‌పై నీళ్లు చల్లాలి. వానపాములను వదిలిన తర్వాత బెడ్‌ను ఎట్టి పరిస్థితుల్లో కదపరాదు. వర్మీ కంపోస్టు మొదటిసారి తయారు కావడానికి 2 లేక రెండున్నర నెలలు పడుతుంది. వానపాములు పైకి వచ్చి ఉన్నప్పుడు కంపోస్టు తయారైనట్లు నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత 3-4 రోజులు నీటిని చల్లడం ఆపాలి. తేమను వెతుక్కుంటూ అవి బెడ్ అడుగు భాగానికి వెళ్లిపోతాయి. అప్పుడు బెడ్‌పైన పరిచిన గోనెసంచి లేదా గడ్డిని తీసివేయాలి. ఈ విధంగా తయారైన వర్మీ కంపోస్టు ముదురు నలుపు రంగులో ఉంటుంది. దీనికి ఏవిధమైన వాసన ఉండదు. ఉదజని సూచిక ఇంచుమించు 70శాతం ఉంటుంది. ఈ విధంగా తయారైన వర్మీ కంపోస్ట్టు 3 మి.మీ. జల్లెడతో జల్లించి సంచుల్లో నింపుకొని చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి.
వర్మీ కంపోస్టుతో లాభాలు
వర్మీ కంపోస్టులో 1-1.5 శాతం నత్రజని, 0.8 శాతం భాస్వరం, 0.8శాతం పొటాష్తోపాటు కాల్షియం, మెగ్నీషియం రాగి, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు విటమిన్లు, ఎంజైములు ఉండడంతో మొక్కల పెరుగుదల బాగా ఉండి దిగుబడులు పెరుగుతాయి.
నేల నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది.
నేల ఆమ్ల లేదా క్షార లక్షణాలను తొలగించవచ్చు.
మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుంది.
కూరగాయలలో రుచి, పూలలో సువాసన, ఆహార పదార్థాలు నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
విలువ ఆధారిత కంపోస్టు
పోషక విలువలను పెంచడానికి 50 కిలోల వర్మీ కంపోస్టుకు కిలో నత్రజనిని స్థిరీకరించే అజటోబ్యాక్టర్ లేదా అజోస్పైరిల్లం కలపాలి. ఈ జీవన ఎరువుల మిశ్రమాన్ని పంట విత్తే 7-10 రోజుల ముందు కొంచెం నీరు చిలుకరించి నీడలో నిల్వ చేస్తే సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగి, దుక్కిలో వేస్తే భూసారం పెరుగుతుంది.
తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు
వివిధ పంటలకు ఎకరాకు 8-12 క్వింటాళ్ల వరకు వర్మీ కంపోస్టు వాడొచ్చు. పండ్ల తోటలకు కూడా బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకూ 5-10 కిలోల వర కు ఎరువును వేయడంతో మంచి ఫలితాలను సాధించవచ్చు. వెయ్యి వానపాములను కొనడానికి సుమారు 500 రూపాయల ఖర్చు వస్తుంది. తర్వాత ఇవి పెరిగి తదుపరి కంపోస్టుకు ఉపయోగపడతాయి. వర్మీ కంపోస్టును తయారు చేస్తున్న రైతుల నుంచి కూడా అవసరమైన వానపాములను పొందవచ్చు.
వర్మీ కంపోస్టుకు కావాల్సినవి
వర్మీ కంపోస్టు తయారు చేసేందుకు బొరియలు చేయని వానపాముల రకాలు.. యూడ్రిలస్ యూగినే, ఆయిసీనియా ఫోటిడి, పెరియానిక్స్, ఆయిసీనియా ఫోటిడాలనుఎక్కువగా వినియోగిస్తారు. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. 25-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. వానపాములకు నేరుగా సూర్యరశ్మి తగలకుండా, బెడ్లో తేమ త్వరగా ఆవిరైపోకుండా, కంపోస్టు తడవకుండా షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో తాటాకులు, గడ్డితో పందిరి ఏర్పాటు చేసుకొని వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వానపాములకు సూర్మరశ్మి, వర్షం నుంచి రక్షణ కల్పించాలి.
వర్మీ కంపోస్టు బెడ్స్‌లో 30-40 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.
పాక్షికంగా కుళ్లిన వ్యర్థ పదార్థాల మిశ్రమాన్ని వాడడం శ్రేయస్కరం.
ఎలుకలు, చీమలు, కోళ్లు మొదలైన శత్రువుల బారి నుంచి రక్షణ కల్పించాలి.
వ్యర్థ పదార్థాలను వేయడం, వర్మీ ఎరువును సేకరించడం సకాలంలో జరగాలి.
వ్యర్థ పదార్థాలలో ప్లాస్టిక్, గాజు పదార్థాలు లేకుండా చూసుకోవాలి.