జాప్యాన్ని నివారిస్తూ చకచకా పూర్తయిన కార్యక్రమం
మత్స్యకారులకు ధీమా కల్పించిన సీఎం కేసీఆర్
భారీ వర్షాలతో చెరువుల్లో నిండుగా జలాలు
1500 జలాశయాల్లో దాదాపు 9 కోట్ల చేప పిల్లలు విడుదల
నిజామాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వందశాతం పూర్తయ్యింది. భారీవర్షాలతోపాటు, చేపపిల్లల విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో కొంత జాప్యం ఏర్పడినా.. అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ అధికారులు లక్ష్యాన్ని పూర్తిచేశారు. నిజామాబాద్ జిల్లాలో ఒక రిజర్వాయర్, 895 చెరువుల్లో 5 కోట్ల 30 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 605 చెరువుల్లో 3 కోట్ల 38 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. రాహు, బొచ్చ, కట్ల మూడురకాల చేప విత్తనాలను వదిలారు. ఇవి తొందరగా వృద్ధి చెందుతాయి. గతంలో తలెత్తిన లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈసారి ఉభయ జిల్లాల్లోని పలు జలాశయాల్లో రొయ్యపిల్లలను సైతం భారీగానే వదిలారు. చేపలు వృద్ధి చెందిన తర్వాత అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలను సైతం ప్రభుత్వం కల్పించింది. నిజామాబాద్ జిల్లాలోని 249 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 16,826 మంది, కామారెడ్డి జిల్లాలోని 147 సంఘాల్లో మొత్తం 13,170 మంది సభ్యులున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలే కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. అనివార్య కారణాలతో ఈ సీజన్లో కాసింత ఆలస్యం అయినప్పటికీ యంత్రాంగం క్రమబద్ధంగా చేప పిల్లలను జలాశయాల్లోకి చేర్చింది. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు గతం కంటే త్వరగా అలుగులు పారడం, చేప పిల్లలు అందుబాటులో లేకపోవడం, టెండర్ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. గతంతో పోలిస్తే 2021, వానకాలంలో చెరువులు, కుంటల్లో భారీగా జలవనరులు నిల్వ ఉండడంతో చేపలు పెంపకానికి అనువైన వాతావరణం ఏర్పడింది. మత్స్యకారులు సైతం చేప పిల్లలను అభివృద్ధి చేసుకునేందుకు చాలా ఆసక్తి తో ఎదురు చూడగా… గతం మాదిరిగానే రూపా యి ఖర్చు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను ముందే గుర్తించిన చెరువుల్లో వదిలారు. నిజామాబాద్ జిల్లాలో 5.30 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 3.38 కోట్లు చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకోగా… అందుకు తగ్గట్లుగానే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సారి ఉభయ జిల్లాల్లోని పలు జలాశయాల్లో రొయ్యలను సైతం భారీగానే వదిలారు.
గెంతులేస్తున్న చేప పిల్లలు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చెరువులు, కుంటలకు కొదువ లేదు. వేలాది జలాశయాలు అందుబాటులో ఉండడంతో మత్స్య అభివృద్ధికి మంచి అనుకూలమైన ప్రాంతంగానూ గుర్తింపు ఉంది. మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై చెరువులు, కుంటల్లో చేప పిల్లలు విడుదల చేస్తున్నది. ప్రస్తుతం అన్ని చెరువుల్లో నూ నీళ్లు పుష్కలంగా ఉండడంతో చేప పిల్లల పెంపకానికి మత్స్యకారులు ఉత్సాహం చూపా రు. చేప పిల్లలను పూర్తి ఉచితంగా ప్రభుత్వమే ఆయా చెరువులకు సరఫరా చేస్తుండడంతో సర్కారు అందిస్తున్న సాయాన్ని అందిపుచ్చుకునేందుకు పోటీ పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో 2021 – 2022లో 895 చెరువులు, ఒక రిజర్వాయర్లో కలిపి 5కోట్ల 30 లక్షల చేప పిల్లల విత్తనాలను వదిలారు. కామారెడ్డి జిల్లాలో 605 చెరువుల్లో 3కోట్ల 38 లక్షల చేప పిల్లలు వదిలినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 249 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా ఇందులో 16,826 మంది సభ్యులున్నారు. కామారెడ్డి జిల్లాలో 147 మత్స్యసహకార సంఘాలున్నాయి. వీటిలో 13,170 మంది సభ్యులున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమం మొదలవ్వగా… అక్టోబర్ నెలాఖరుకు లక్ష్యాన్ని మత్స్య శాఖ అధిగమించింది. పుష్కలమైన జల వనరుల్లో సర్కా రు సరఫరా చేసిన రాయితీ చేప పిల్లలు చెంగుమంటూ గెంతులేస్తున్నాయి.
అక్రమాలకు అడ్డుకట్ట…
చేప పిల్లల పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యవస్థను తీర్చిదిద్దింది. కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా నిఘా ఏర్పా టు చేసింది. నిర్ధిష్ట ప్రమాణాలతో కూడిన చేప పిల్లలను సరఫరా చేయని కాంట్రాక్టర్లకు ఈసారి నోటీసులు పంపించి వివరణ అడగడం, అంతేకాకుండా తప్పు చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సర్కారు నిర్ణయించడంతో జవాబుదారీతనం కనిపించింది. తప్పు చేసినట్లు తేలితే మత్స్య శాఖ అధికారులపైనా చర్యలు తీసుకునేలా యం త్రాంగం సిద్ధం కావడంతో పారదర్శకత ఏర్పడింది. వాస్తవానికి కాంట్రాక్టర్లు బ్రీడర్ విత్తనాలను ఒకటి, రెండు చెరువుల్లో పెంచి వాటి పెరుగుదలను గమనించాల్సి ఉంటుంది. తర్వాత వాటి సహాయంతో విత్తును ఉత్పత్తి చేయించి పంపిణీ చేయాలి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటువంటివేమీ చేయకుండానే అందుబాటులో ఉన్న నాణ్యతలేని వాటిని అంటగడుతున్నారని మత్స్యకారులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. రాహు, బొచ్చ, కట్ల మూడు రకాల విత్తును నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి తొందరగా వృద్ధి చెందుతాయి. ప్రతి చెరువులో ఈ మూ డు రకాలు వేర్వేరుగా సం చుల్లో అందజేయాలి. మూ డు రకాల చేప పిల్లలను ఒకే సంచిలో వేసి చెరువులోకి వదిలేస్తున్నారు. ఇందులో అరవై శా తం మృత్యువాత పడుతున్నట్లుగా మత్స్యకారులు చెబుతుండగా… గతానికి భిన్నంగా మత్స్యకారుల కోరిక మేరకు చేప పిల్లలను వదిలారు.
మత్స్యకారులకు భరోసా
మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తలపెట్టిన అద్భుతమైన కార్యక్రమం చేప పిల్లల పెంపకం. ఆర్థికంగా చితికి పోయిన కుల వృత్తిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దిక్కుగా అండగా నిలుస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను కాలానుగుణంగా ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలను సైతం ముంగిటకు తీసుకువచ్చారు. మత్స్యకారులు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే చేపలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. నాణ్యమైన చేప పిల్లలను గుర్తించి, శాస్త్రీయ పద్ధతిలోనే చెరువుల్లో చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. గతంలో మత్స్యకారులను పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. గ్రామాల్లో చెరువుల్లో చేప పిల్లలు పెంపకానికి పెట్టుబడి లేక ఆయా వర్గాలు అల్లాడిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వమే రూ.వేల కోట్లు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చేపల వేట జీవనాధారంగా చేసుకుని బతుకీడుస్తున్న కుటుంబాలను ఆదుకోవాలనే తపనతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారు. చేపల ఉత్పత్తి పెరిగి ఆర్థిక ప్రయోజనం భారీగా చేకూరడం ద్వారా మత్స్యకారుల జీవనానికి ఢోకా లేకుండా ఉంటున్నది.