నిజాంసాగర్, డిసెంబర్ 19: నిజాంసాగర్ జడ్పీఉన్నత పాఠశాలలో 15 రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాల్సి వస్తున్నది. సమయానికి బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఈ నెల ఒకటి నుంచి బాధ్యతల నుంచి తప్పుకొన్నారు.
పాఠశాలలో సుమారు 230 మంది విద్యార్థులు ఉండగా..వారందరూ ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారు. స్కూల్లో వంట చేసేందుకు ఏజెన్సీలు ముందుకురావడంలేదని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వంట చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్ర గురువారం తెలిపారు.
బిచ్కుంద జ్యోతిబా ఫూలే పాఠశాలలో నీటి కొరత ఏర్పడింది. ఒకవైపు మిషన్ భగీరథ నీరు రాకపోవడం, మరోవైపు పాఠశాలలోని బోరు మోటర్ చెడిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం బయటి నుంచి బకెట్లలో నీళ్లు తెచ్చుకొని అవసరాలను తీర్చుకోవాల్సి వచ్చింది. అధికారులు స్పందించి బోరు మోటరు వెంటనే బాగు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు.
-బిచ్కుంద, డిసెంబర్ 19