బోధన్ రూరల్, ఏప్రిల్ 6: ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్‌కు ఒక న్యాయం.. తెలంగాణకో న్యాయమా అంటూ టీఆర్ఎస్ నాయకులు, రైతులు మండిపడ్డారు. అన్నదాతలు కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను కొనకుండా రైతుల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా డబుల్ చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బోధన్ మండలం సాలూరా వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం రాస్తారోకో చేశారు. రాష్ట్రంలో సాగుచేసే రెండు పంటలనూ కొనుగోలు చేయాలంటూ ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించారు. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. నిరసన కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, శరత్, ఎంపీపీ బుద్దె సావిత్రి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మాణిక్ వెంకట్‌రెడ్డి, మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సన్న, కార్యదర్శి సిర్ప సుదర్శన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.