భిక్కనూరు, ఏప్రిల్ 6 : చేపలు పట్టే విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జంగంపల్లిలో చేపలు పట్టడానికి మత్స్యకారుల సంఘం సభ్యులు బుధవారం కుంటలోకి దిగారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు చేపలు పట్టేందుకు హక్కు లేదని వారితో వాగ్వాదానికి దిగారు. మత్స్యశాఖ అధికారుల అనుమతితోనే చేపలు పడుతున్నామని మత్స్యకారుల సంఘం సభ్యులు తెలుపగా.. ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది. ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో కుంట వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకున్నది. సమాచారం అందుకొని ముందుగా అక్కడికి వెళ్లిన కానిస్టేబుళ్లు విషయాన్ని సీఐ తిరుపయ్య, ఎస్సైలు ఆనంద్‌గౌడ్, హైమద్కు వివరించగా.. వారు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.
ఇరువర్గాల దాడిలో జంగం అంజయ్య, నీల స్వామి, మణెమ్మ, నవీన్ అనే వ్యక్తులకు గాయాలు కావడంతో వారిని దవాఖానకు తరలించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో సర్కిల్ ఫరిధిలోని ఎస్సైలు సుధాకర్, గుండ్ల రాజు, కామారెడ్డి నుంచి అదనపు బలగాలను సైతం అక్కడికి రప్పించారు. మత్స్యకారులకు కుంటలో చేపలు పట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పోలీసులు ముదిరాజ్ సంఘ సభ్యులకు నచ్చజెప్పారు. తాము నాలుగేండ్లుగా కుంటలో చేపపిల్లలను వదులుతున్నామని, చేపలు పట్టే హక్కు తమకే ఉందని ముదిరాజ్ సంఘ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు నాలుగు గంటలపాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. మత్స్యకారులు చేపలు పట్టుకొని తిరిగి వెళ్లే వరకు పోలీసులు వారికి రక్షణగా నిలిచారు. అనంతరం ముదిరాజ్ కులస్తులను సముదాయించి అక్కడి నుంచి పంపివేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.