బీర్కూర్ / రుద్రూర్, ఏప్రిల్ 5 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, చందూర్ మండల కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధును విజయవంతం చేయాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉన్నదన్నారు. దళితులను ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేస్తూ ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొదటి విడుతగా 100 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా అందులో కామారెడ్డి జిల్లాలోని మండలాలకు చెందిన 50, నిజామాబాద్ జిల్లాలోని మండలాలకు చెందిన 50 మందికి యూనిట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదే నెలలో నియోజకవర్గానికి 2వేల యూనిట్ల చొప్పున రూ.200 కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. బాన్సువాడలో ఏడు వేల కుటుంబాలు ఉన్నాయని, ఏడాదికి 2వేల చొప్పున దళితబంధును ఇచ్చి పేదవారిని ఉన్నతస్థితికి చేరుస్తామని చెప్పారు.దళితబంధును ప్రతి కుటుంబానికి అందజేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. బీర్కూర్‌లో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు, రుద్రూర్లో వర్ని, చందూర్, రుద్రూర్, మోస్రా, కోటగిరి మండలాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేశారు. మిగతా వారికి ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా యూనిట్లు అందజేస్తామని వివరించారు. అనంతరం యూనిట్లు అందుకున్న లబ్ధిదారులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ నడిపారు.
బీర్కూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మాజీద్, ఎంపీపీలు దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి, తిలకేశ్వరి రఘు, పాల్ద్య విఠల్, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్లు పాత బాలక్రిష్ణ, ద్రోణవల్లి అశోక్, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఆత్మ చైర్మన్ మోహన్ నాయక్, సొసైటీ చైర్మన్లు క్రిష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, తహసీల్దార్ ఎం.రాజు, ఎంపీడీవో రాధ పాల్గొన్నారు. రుద్రూర్లో ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీలు అక్కపల్లి సుజాత నాగేందర్, మేక లక్ష్మీవీర్రాజు, జడ్పీటీసీలు నారోజి గంగారాం, భాస్కర్‌రెడ్డి, మండల నాయకుడు పత్తి రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, సంజీవ్, వైస్‌ఎంపీపీ సాయిలు తదితరులు పాల్గొన్నారు.