బోధన్, ఏప్రిల్ 5: కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచిందని అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు వి.చలపతిరావు ఆవేదన వ్యక్తంచేశారు. బోధన్ పట్టణంలోని తాలూకా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మంగళవారం నిర్వహించిన ఏఐకేఎంఎస్ నిజామాబాద్ జిల్లా నిర్మాణ జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయన ప్రధానవక్తగా పాల్గొని మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపెట్టి దేశప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నా.. కేం ద్రంలోని బీజేపీ పాలకులు ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. జిల్లాలో రైతాంగ సమస్యలపై 41 ఏండ్లుగా రైతుకూలీ సంఘం పోరాటాలు చేసిందని, భూమిలేని పేదలకు భూములు పంచేందుకు ఉద్యమాలు నడిపిందన్నారు. రైతాంగ సమస్యలు, ప్రజా స మస్యలను గ్రామం యూనిట్‌గా ఏఐకేఎంఎస్ సభ్యులు తెలుసుకుని, వాటి పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశం ప్రారంభంలో ఏఐకేఎంఎస్ జెండాను ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ఆవిష్కరించారు. సభలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు టి.కృష్ణాగౌడ్, నడ్పి భూమయ్య, పర్వయ్య, బన్సీ, ప్రజాసంఘాల నాయకులు దాల్మల్క పోశెట్టి, గౌతమ్, కల్యాణ్, ప్రకాశ్, గోపాల్, సరిత, జి.భూమన్న, శివ, న్యాయవాది జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.