బీర్కూర్, ఏప్రిల్ 3 : రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి బీజేపీ నాయకుడు మల్యాద్రిరెడ్డికి లేదని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణా రెడ్డి హెచ్చరించారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. బోధన్ పట్టణంలో శివాజీ విగ్రహం విషయం లో అల్లర్లకు కారకుడై జైలుకు వెళ్లిన మల్యాద్రి పో చారమే తనను జైలుకు పంపినట్లు ఆరోపించడం తగదన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మల్యాద్రి వ్యవహారం తయారయ్యిందని విమర్శించారు. పోచారం రాజకీయ అనుభవం ఉన్నంత వయస్సులేని మల్యాద్రి ఆయనను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో జరగనంతగా బా న్సువాడను అభివృద్ధి చేసిన పోచారంను విమర్శించడం మల్యాద్రి తెలివితక్కువ తనానికి నిదర్శనమని విమర్శించారు. విమర్శలు మాని బాన్సువాడను మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సూచించారు. మల్యాద్రికి పోచారంను కాదుకదా ఆయన కుమారులు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డిని విమర్శించే అర్హత కూడా లేదన్నారు. మరోమారు పోచారం కుటుంబాన్ని విమర్శిస్తే బాన్సువాడ నియోజకవర్గంలో మల్యాద్రిని తిరగనివ్వబోమని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా అందరి మనిషిగా ఉన్న నాయకుడిని విమర్శించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
హిందువునని జబ్బలు చరుచుకునే మల్యాద్రి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి హిందూ, ముస్లిం విభేదాలను సృష్టిస్తున్నాడని, తమ నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి పదేండ్ల క్రితమే బాన్సువాడ నడిబొడ్డున శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించా రని అన్నారు. 50 ఏండ్ల చరిత్రలో బీజేపీకి బాన్సువాడలో డిపాజిట్ సైతం దక్కలేదన్నారు. మల్యాద్రి బాన్సువాడకు ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నాడని, అది కేవలం కలగానే మిగిలిపోతుందన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, నాయకులు గోపాల్‌రెడ్డి, ఎజాజ్, దాసరి శ్రీనివాస్, గణేశ్, లింగం, రఫీ, అహ్మద్, మోతీలాల్, నందకిశోర్, ఇలియాస్ అలీ తదితరులు పాల్గొన్నారు.