నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఉచిత శిక్షణ కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్(రాత పరీక్ష) ప్రశాంతంగా ముగిసింది. పలు పరీక్షా కేంద్రాలను సీపీ నాగరాజు పరిశీలించారు. మొత్తం 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించా రు. కేంద్రాల వద్ద అభ్యర్థులను పోలీసు సిబ్బంది తనిఖీ చేసి, పరీక్షా హాలులోకి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకునేలా సూచించడానికి బస్టాండ్, రైల్వే స్టేషన్లో పోలీసులు ప్రత్యేక హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీపీ నాగరాజు పర్యవేక్షణలో అదనపు డీసీపీ డాక్టర్ వినీత్, నరేందర్ రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు వెంకటేశ్వర్, రఘు, రామారావు, ప్రభాకర్, సంతోష్‌తో పాటు 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. వీరితో పాటు సుమారు 400 మంది ఇన్విజిలేటర్లు, ఐటీ సెల్ సిబ్బంది, వివిధ కళాశాలల సిబ్బంది విధులు నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్టుకు మొత్తం 6,094 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 3,527 మంది హాజరయ్యారు. ఫలితాలను త్వరలో వెల్లడిస్తామని సీపీ తెలిపారు. అభ్యర్థులు ప్రతి రోజూ www. nizamabadpolice.in వెబ్ సైట్‌ను చూడాలని సూచించారు.