బోధన్, ఏప్రిల్ 3: పట్టణంలోని శక్కర్‌నగర్ రామాలయం కల్యాణ మండపంలో పంప సాహితీ పీఠం పుష్కర మహోత్సవం – కవి సమ్మేళనం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కొనసాగింది. పుష్కర మహోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన కవులు తమ కవితాగానంతో సాహితీ సౌరభాలను వెదజల్లారు. ఈమహోత్సవానికి ముఖ్యఅతిథిగా బోధన్ ఆర్డీవో ఎస్.రాజేశ్వర్ హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పంప సాహితీ పీఠం వ్యవస్థాపక సభ్యులు మోహనప్రసాద్, శ్రీహరిరామం, కాట్రగడ్డ రాయన్న, వెంకటేశ్వరరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి కవులు, రచయితలు మౌనం పాటించారు.
ఆర్యసమాజ్ దయానంద్ గోశాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పంప సాహితీ పీఠం అధ్యక్షుడు పురాణే అజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. కవి సమ్మేళనంలో ఊషకోయల సత్యనారాయణ రాసిన ‘జీవనంలో గమనం’, మొగిలి స్వామిరాజ్ రాసిన ‘నిశ్శబ్ద రహస్యాలు’ పుస్తకాలను ఆర్డీవో రాజేశ్వర్ ఆవిష్కరించారు. ‘నిశ్శబ్ద రహస్యాలు’ పుస్తకంపై ప్రముఖ కవి కాసర్ల నరేశ్‌రావు, ‘జీవనంలో గమనం’ పుసక్తంపై కవి కాట్రగడ్డ భారతి సమీక్ష చేశారు. మానవీయ విలువలు, ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, తెలంగాణ సంస్కృతి, శుభాకృత్ ఉగాది తదితర అంశాలను స్పృశిస్తూ పలువురు కవులు తమ కవితలను వినిపించారు.
కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆర్యసమాజ్ బోధన్ శాఖ ప్రధాన్ చిదుర ప్రదీప్ గుప్తా, పంప సాహితీ పీఠం గౌరవ అధ్యక్షుడు ఎం.రాజేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి పబ్బ మురళి, కార్యదర్శులు శేషతల్పసాయి, ప్రభాకర్, కోశాధికారి లోల శంకర్, గౌరవ అతిథులుగా బోధన్ టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్, ప్రముఖ కవి కాసర్ల నరేశ్‌రావు, తెలుగు గజల్ కవి సూరారం శంకర్, కవులు కాట్రగడ్డ భారతి, సిరిగాద శంకర్, డాక్టర్ పింగళి గంగాధర్‌రావు, తిరుమల శ్రీనివాస్ ఆర్య, సుప్పని సత్యనారాయణ, రేణుక, దుర్గాబాయి, అమరావతి, అలివేణి, పుండరీగౌడ్, బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్, జిల్లా చరిత్ర పరిశోధకుడు సిద్ధ సాయారెడ్డి, పంప సాహితీ పీఠం ముఖ్య సలహాదారుడు సాగిరాజు బలరామరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో కుమారి అభిజ్ఞ చేసిన స్వాగత నృత్యం అందరినీ విశేషంగా అలరించింది.
అతిథులకు బొకేలకు బదులు మొక్కలు
కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో రాజేశ్వర్‌తో పాటు కవి సమ్మేళనంలో పాల్గొన్న అతిథులు, కవులను పంప సాహితీ పీఠం నిర్వాహకులు శాలువా, జ్ఞాపికలతో న్మానించారు.ఆనవాయితీగా వారికి బొకేలు ఇవ్వకుండా మొక్కలను అందించారు.
పంప కవిపై లోతైన పరిశోధనలు జరగాలి:ఆర్డీవో రాజేశ్వర్
ఒకపక్క తెలుగు సాహిత్యం అభివృద్ధి కోసం కృషిచేస్తూ, మరోపక్క బోధన్‌లో పెరిగి, ఇక్కడ సమాధి అయిన పంప కవి చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి పంప సాహితీ పీఠం చేస్తున్న కృషి అభినందనీయమని ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. కీ.శ. 10 శతాబ్దంలో చాళుక్య రాజు రెండో అరికేసరితో పాటు చదువుకున్న పంప కవి బోధన్‌లో ఉండేవాడని, నన్నయ్య కన్నా ముందే తెలు గు రచనలు చేశాడన్నారు. ఇందుకు సంబంధించిన సరైన సాక్ష్యాధారాలను సంపాదించేందుకు లోతైన పరిశోధనలు జరగాలని అన్నారు. పంప కవిని తెలుగులో ఆదికవిగా నిరూపించేందుకు అవసరమైన పరిశోధనలు జరిగేందుకు పంప సాహితీ పీఠం తోడ్పడాలన్నారు. తెలుగు భాష తెలంగాణలో ముఖ్యంగా గోదావరి లో యలోనే పుట్టి పరిణామక్రమంలో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుగడ సాధించాలంటే ఇంగ్లిష్ భాషపై పట్టును సాధించాల్సిన అవసరం ఉందని, అంతమాత్రాన తెలుగు భాషను నిర్లక్ష్యం చేయరాదన్నారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాలన్నా, మన కవుల గొప్పతనాన్ని అర్థంచేసుకోవాలన్నా.. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్డీవో అన్నారు.