అంబరాన్నంటిన హోలీ సంబురాలు
రంగుల్లో మునిగితేలిన జనం
వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
హున్సాలో ఉత్కంఠగా సాగిన పిడిగుద్దులాట
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 18 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ పండుగను శుక్రవారం జరుపుకొన్నారు. జనం రంగుల వేడుకల్లో మునిగితేలారు. హోలీ రాగానే రాష్ట్రం దృష్టిని ఆకర్షించే బోధన్ మండలం హున్సా గ్రామంలో ఈసారి సంప్రదాయ పిడిగుద్దులాట ఉత్కంఠగా సాగింది. కుస్తీపోటీలకు వివిధ రాష్ర్టాల మల్లయోధులు హాజరయ్యారు.
హోలీ పండుగను జిల్లావ్యాప్తంగా ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. పండుగలో చిన్నా పెద్దా తేడాలేకుండా పాల్గొని రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఒకరిపైమరొకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సారి వేడుకల్లో సంప్రదాయ రంగులకు ప్రాధాన్యమిచ్చారు. యువత కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. గురువారం రాత్రి కామ దహన కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలో ఎంపీపీ కవిత, రాంపూర్‌లో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలం గోర్గల్‌లో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, మహ్మద్‌నగర్‌లో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని కలాల్గల్లీలో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కామదహనాన్ని నిర్వహించారు. వేదపండితుడు జోషి ప్రణయ్ పంతులు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కామదహనం చేశారు.
ఎల్లారెడ్డి డివిజన్‌కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, నాయకులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
బాన్సువాడ మండలం బోర్లంక్యాంపు తండాలో గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గోగిపువ్వుతో తయారు చేసిన రంగులను చిన్నపిల్లలు చల్లుకుంటూ సందడి చేశారు.
బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ప్రసాద్, సిబ్బంది వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. బాన్సువాడలోని ప్రధాన కూడలి వద్ద ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డీజే పాటల మధ్య కోలాటాలు వేస్తూ హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ హాజరయ్యారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ పండుగను శుక్రవారం జరుపుకొన్నారు. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు రంగుల్లో మునిగితేలారు. చిన్నాపెద్దా కలిసి ఆడిపాడుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.