హున్సాలో ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు
ఐదు నిమిషాలపాటు సాగిన పిడిగుద్దులాట
తరలివచ్చిన మహారాష్ట్ర వాసులు
బోధన్ రూరల్, మార్చి 18: బోధన్ మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించారు. సాయంత్రం 6.35 గంటలకు గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొన్నారు. అడ్డుగా కట్టిన తాడుకు రెండు వైపులా నిలబడి ముఖాలు, వీపులపై గుద్దుకున్నారు. ఈ ఆట సుమారు ఐదు నిమిషాలపాటు కొనసాగింది. చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి ప్రజలు తరలివచ్చారు. పండుగ సందర్భంగా గ్రామంలో జాతర ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బోధన్ ఏసీపీ రామారావు, బోధన్ రూరల్ సీఐ రవీందర్‌నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొన్నేండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
ఏటా హోలీ పండుగ నాడు పిడిగుద్దులాట నిర్వహించుకోవడం కొన్నేండ్లుగా ఇక్కడ కొనసాగుతున్న సంప్రదాయం. ఈ ఆటను నిర్వహించవద్దని పోలీసులు చెప్పినప్పటికీ గ్రామస్తులు పట్టించుకోలేదు. పిడిగుద్దులాట నిర్వహించకుంటే గ్రామానికి అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల విశ్వాసం. పిడిగుద్దులాట ప్రారంభానికి ముందు గ్రామ శివారులో కుస్తీపోటీలు నిర్వహించారు.