పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు
రేవంత్ పర్యటనకు ముందు బయటపడిన నాయకుల విభేదాలు
ఎల్లారెడ్డి, మార్చి 18 : ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో తలపెట్టిన మన ఊరు-మన పోరు సభ విషయంలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య రచ్చ చోటు చేసుకున్నది. రెండు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు సైతం చేసుకున్నాయి. ఎట్టకేలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో ఆ వర్గాలు సైలెంట్ అయినట్లు సమాచారం. ఈ నెల 20న ఎల్లారెడ్డి పట్టణంలో మన ఊరు-మన పోరు పేరున కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం ఎల్లారెడ్డి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాయకులు ఇప్పటికే రెండుసార్లు పర్యటించి సభా స్థలిని నిర్ణయించారు.
సభా ప్రాంగణా న్ని అలంకరించడంతో పాటు పట్టణంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి అనుచరులు. శుక్రవారం ఉదయం పార్టీకి చెందిన మదన్మోహన్ అనుచరులు కొందరు వచ్చి ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా సుభాష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పుడు వచ్చి బ్యానర్లు కట్టడమేమిటని అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది. ఒక దశలో సభ ఎలా జరుగుతుందో చూస్తామని, అడ్డుకుంటామని మదన్ మోహన్ అనుచరులు పేర్కొనడం ఇరువర్గాల గొడవకు కారణమైందని ఆ వర్గాలే పేర్కొంటున్నాయి. అప్పటికే గొడవ జరుగుతున్న విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గొడవపై రేవంత్ రెడ్డి సీరియస్
ఎల్లారెడ్డిలో రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమాషా చేస్తున్నారా అంటూ ఓ వర్గం నాయకుడి అనుచరులపై సీరియస్ అయినట్లు సమాచారం. వెంటనే ఫిర్యాదు వాపస్ తీసుకోవాలని, సభను సక్సెస్ చేయాలని ఆదేశించడంతో సుమారు నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉన్న నాయకులు ఎట్టకేలకు సా యంత్రం మూడు గంటలకు తమ పనుల్లోకి వెళ్లారు.