ప్రభుత్వ పాఠశాలల్లో పోటీ తత్వం పెరిగింది
నెమ్లి పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన స్పీకర్ పోచారం
విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన సభాపతి
నస్రుల్లాబాద్, మార్చి 12: విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పాఠశాల విద్యనే విద్యార్థికి పునాది అని పేర్కొన్నారు. మండలంలోని నెమ్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రూ.61లక్షలతో నిర్మించిన ఎనిమిది అదనపు తరగతి గదులను స్పీకర్ శనివారం ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి వరుసలో నిలబడి ప్రార్థన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ.. విద్య మనిషికి వికాసాన్ని, జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. సమాజంలో ఉన్నత స్థితికి ఎదగడానికి విద్యనే మార్గమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పోటీతత్వం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించి అవసరమైన వసతులు,సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. నియోజక పరిధిలో రూ.22 కోట్లతో 220 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం స్పెషల్ డెవల్మెంట్ ఫండ్ మంజూరు చేశామని చెప్పారు.
బాన్సువాడలో రూ.40 కోట్లతో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయించామని, భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7300కోట్లతో మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రారంభించిందన్నారు. పాఠశాలకు లక్ష రూపాయలతో బెంచీలను వితరణ చేసిన సూర అనుసూయ, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం సాయిబాబా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నెమ్లి పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొని విద్యార్ధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గంగామణి, ఎంపీటీసీ సభ్యురాలు నాయిని రాధ, హెచ్ఎం వెంకటరమణ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, దుర్కి విండో చైర్మన్ దివిటి శ్రీనివాస్, నాయకులు ప్రతాప్, హన్మాడ్లు,భూమేశ్, సుభాష్, కిశోర్ యాదవ్, వీరారెడ్డి, గిర్మయ్య తదితరులు పాల్గొన్నారు.