కామారెడ్డి, జూన్ 20 : మనుషులకు జీవితం ఎంత ముఖ్యమో… ట్రాఫిక్ రూల్స్ అంతే ముఖ్యమని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారిణి వాణి అన్నారు. పాఠశాలల బస్సులపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మైనర్లకు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని, మైనర్ల చేతిలో ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, మోటర్ వాహనాల చట్టం నియమాల మేరకు స్కూల్ బస్సులను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. మోటర్ వాహనాల చట్టం 1988, కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త మోటర్ వాహనాల రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటి నియమ, నిబంధనలు పాటించాలన్నారు. పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో స్కూల్ బస్సులు నడిపే పాఠశాలలు పాటించాల్సిన నియమనిబంధనలపై సోమవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ : పాఠశాలల బస్సులపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..
ఆర్టీవో : పాఠశాలలు ప్రారంభమైనందున స్కూల్ బస్సుల విషయంలో నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. కామారెడ్డి జిల్లా పరిధిలోని 270 స్కూల్ బస్సులుండగా, వాటిలో 50 బస్సులు 15 ఏండ్లకు పైబడిన బస్సులుగా గుర్తించాం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పవద్దు, వాటిని స్క్రాప్‌కు పంపించాలి. పాఠశాల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవాలి.
నిబంధనలు పాటించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..
మోటర్ వాహనాల చట్టం, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి, రవాణా శాఖ నియమాల మేరకు స్కూల్ బస్సులను వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. స్కూల్ బస్సు రోడ్డు ఎక్కాలంటే తప్పనిసరిగా 32 నిబంధనలు పాటించాల్సిందే. బస్సు డ్రైవర్‌కు హెవీ మోటర్ లైసెన్స్, బ్యాడ్జ్ లైసెన్స్‌తో పాటు భారీ వాహనాలు నడపడంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపై తిప్పితే స్పెషల్ డ్రైవ్ చేపట్టి సీజ్ చేస్తాం.
ఇతర వాహనాలపై ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు.
స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలపైన గట్టి నిఘా ఏర్పాటు చేశాం. నియమనిబంధనలతో పాటు వాహన చోదకులు కచ్చితంగా అనుభవజ్ఞుడై … శారీరకంగా, మానసికంగా బాగుండాలి. వాహన డ్రైవర్లు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మద్యం తాగకుండా ప్రతిరోజూ పరీక్షలు చేయడం, సంబంధిత పాఠశాలలతో పాటు తల్లిదండ్రులు సైతం పర్యవేక్షించాలి. ప్రతి 3నెలలకోసారి పేరెంట్స్ కమిటీ బస్సు కండీషన్‌పై తనిఖీలు నిర్వహించుకోవాలి.
మైనర్లకు వాహనాలు ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?
మైనర్లకు తల్లిదండ్రులు ఎలాంటి వాహనాలు ఇవ్వొద్దు. ద్విచక్ర, ఇతర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత. పిల్లలు చేసే ప్రమాదాలకు తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రమాదాల తీవ్రతను బట్టి తల్లిదండ్రులకు జరిమానా, జైలు శిక్షలు పడతాయి. ప్రతి నెలా రెండో సోమవారం కలెక్టర్ పర్యవేక్షణలో పాఠశాలల్లో రోడ్ సెప్టీ సమావేశాలు, సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం.
ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ?
గూడ్స్ వాహనాల్లో ప్రజలు ప్రయాణించవద్దు. ప్యాసింజర్ వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. వివిధ ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ సూచించిన మేరకు వాహనాలను నడపాలి. అతివేగంతో వెళ్లకుండా, ప్రమాదాల నివారణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశాం. దీనిని జిల్లా పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశాం. ప్రమాదాలకు పాల్పడినా, అతివేగంగా వెళ్లినా జరిమానా ఆన్లైన్లో నేరుగా ఇంటికే పంపిస్తాం. స్పీడ్ లిమిట్, మోటర్ వాహనాల చట్టం, రవాణాశాఖ నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలి. ఆటో, జీపులలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దు.
ప్రమాదాల నివారణకు ఎటువంటి సూచనలు చేస్తారు.
కామారెడ్డి జిల్లాలో ద్విచక్ర వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రమాదాలతో మరణాల రేటు పెరగడంతో పాటు అంగవికలురుగా మారుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఇద్దరూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుంది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపొద్దు.