మాచారెడ్డి/కామారెడ్డి, మార్చి 28 : దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు మృత్యువాత పడిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఎం) గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి మాచారెడ్డి ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో నివాసం ఉండే వేల్పూరి రాధాకృష్ణమాచారి (46) నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూ టీ ఇన్స్పెక్టర్ వద్ద సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన తన తల్లి సువర్ణ(70), భార్య కల్పన,(37), కుమారులు రాఘవాచారి, శ్రీరాం (10), సీతారాంనగర్ కాలనీలో నివాసం ఉండే జెల్లీ నరేందర్(47) కారును అద్దెకు తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల శ్రీసీతారామస్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఘన్పూర్(ఎం) గ్రామశివారులోని మూలమలుపు వద్దకు రాగానే కరీంనగర్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురి తలలు పగిలి అక్కడిక్కడే మృతిచెందారు. రాధాకృష్ణ పెద్ద కొడుకు రాఘవ కారులో నుంచి బయట పడడంతో తీవ్రగాయాలయ్యాయి. రాఘవను అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా వైద్యశాలకు తరలించారు.
బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి దవాఖానకు తరలించినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.
అతివేగమే కారణమా…!
రాధాకృష్ణమా చారి తన కుటుంబ సభ్యులతో కలిసి తెలిసిన వారి కారు తీసుకొని డ్రైవర్ సహాయంతో దైవదర్శనానికి బయల్దేరాడు. కారు ప్రమాదానికి ముందు 110 స్పీడ్‌తో వెళ్తున్నట్లు చూపిస్తున్నది. స్పీడ్మీటర్ 110 దగ్గర ఆగిపోయి ఉంది.
తెరుచుకోని ఎయిర్ బ్యాగ్స్ ..
ప్రమాదానికి గురైన కారులో ప్ర మాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నట్లయితే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేది కాదేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒకేసారి ఐదుగు రు దుర్మరణం చెందడం అందులో ఒకే కు టుంబానికి చెందిన వారు నలుగురు ఉండడం స్థానికులను కంటతడిపెట్టింది.
గ్యాస్‌కట్టర్ సహాయంతో డోర్ల తొలగింపు
కారు పూర్తిగా ధ్వంసం కావడంతో నాలుగు మృతదేహాలు కారులోనే ఇరుకున్నా యి. పోలీసులు, స్థానికులు, గ్యాస్ కట్టర్ సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు. మృతదేహాలను బయటికి తీయడానికి పోలీసులకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక ఎస్సై సంతోష్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ అన్యోన్య, కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, పోలీసు సిబ్బంది ఉన్నారు.