కామారెడ్డి/ హైదరాబాద్ మార్చి 20 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా వాళ్ల పార్టీ చక్కదిద్దుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సూచించారు. కాంగ్రెస్ వాళ్లు వర్గపోరును వీడి ఇంటిని చకదిద్దుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డికి దోచుకునే అవకాశం ఉండేదని, అలా కాకపోవడంతో షబ్బీర్ అలీ బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీల కోసం విద్యా, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని, అవి కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీకి కనబడుతలేవా అంటూ నిలదీశారు. ఎల్లారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మన ఊరు- మన పోరు సభలో కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నేతలు ఆదివారం తెలంగాణ భవన్లో ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ 206 గురుకులాలను ఏర్పాటు చేశారని, ముస్ల్లిం అనాథల కోసం రూ.10కోట్లతో నాంపల్లిలో భవనాన్ని నిర్మిస్తున్నారని, షాదీ ముబారక్, ఓవర్సీస్ విద్యా పథకాన్ని అమలు చేస్తున్నారని, ఇవన్ని మైనార్టీల కోసం కాదా అంటూ నిలదీశారు. 10 వేల మంది ఇమామ్ , మౌజమ్‌లకు నెలకు రూ.5వేల వేతనాన్ని ఇస్తున్నారని అన్నారు. షబ్బీర్ అలీ ఓడిపోయిన చరిత్రను ఎల్లారెడ్డి సభలో చెప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. సభ ము గియగానే కాంగ్రెస్‌లోని మదన్ మోహన్ వర్గీయులు ఇతర నాయకులు ఒకరి ఫ్లెక్సీలు మరొకరు చించుకుంటారని, ఇదీ కాంగ్రెస్ నాయకుల తీరన్నారు. వారు మొదట తమ పార్టీ గురించి ముందుగా ఆలోచించుకుంటే మంచిందన్నారు. మన ఉరు మన పోరు కా కుండా మన ఊరు కాంగ్రెసోల్ల పోరుగా సభ పేరు మార్చుకుంటే బాగుండేదన్నారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి..
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ యావత్తు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. 2001లోనే టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కొత్తలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనిమిది మండలాలకు ఆరు మండలాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిందన్నారు. తాను తెలంగాణ ఉద్యమకారుడిననే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చిందన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చెసుకుంటున్నానని అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధిని చూసి పెట్టుబడులు వస్తున్నాయి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి పరిశ్రమలకు, ఐటీ రంగానికి పెట్టుబడులు వస్తున్నాయని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఫ్రస్టేషన్లో అసత్యపు ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ముందు వర్గపోరును వీడి ఇంటిని చక్కబెట్టుకోవాలని టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ హితవు పలికారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ టీఆర్ఎస్ పార్టీపై విమర్శ లు చేయడం తగదన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, సీనియర్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.