బీర్కూర్, సెప్టెంబర్ 20: బాన్సువాడ నియోజకవర్గంలో ఇల్లులేని ప్రతి పేదవాడికీ సొంతింటి కలను సాకారం చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా పది వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించామని తెలిపారు. అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మంగళవారం ఆయన బీర్కూర్ మండలంలోని దామరంచ, అన్నారం, రైతునగర్ గ్రామాల్లో ఆసరా పింఛన్ పత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామాల్లో పర్యటించి మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు.
దేశంలో అత్యధిక మంది పేదలకు ఆసరా పింఛన్లను అందిస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. వృద్ధులు, వికలాంగులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు పింఛన్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఆసరా పెన్షన్లతో ఇండ్లల్లో వృద్ధులకు గౌరవం పెరిగిందన్నారు. ఇంటికి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో 40 వేల మందికి పింఛన్లు వస్తున్నాయన్నారు.
మన రాష్ట్రంలోనే అత్యధిక పింఛన్లు
మన రాష్ట్రంలో 45 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. పింఛన్ రూ.2016, 3,016 ఇస్తున్నామని, ఇది దేశంలోనే అత్యధికమని అన్నారు. పెద్ద రాష్ట్రాలైన గుజరాత్లో కేవలం 12.40 లక్షల మందికి, మహారాష్ట్రలో 31.50 లక్షల మందికి మాత్రమే పిం ఛన్లు ఇస్తున్నారని చెప్పారు. గుజరాత్లో పింఛన్ రూ.770 మాత్రమే ఇస్తున్నారని, అది కూడా 80 ఏండ్లు దాటిన వారికి మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన వారికి ఇస్తున్నామన్నారు. కొన్ని చిన్న రాష్ర్టాల్లో రూ. 200 మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. కొంతమంది కావాలనే విమర్శలు చేస్తున్నారని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇంతపెద్దమొత్తంలో పింఛన్లను అమలు చేసి చూపించాలని సూచించారు.
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేత
ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు మన రాష్ట్రంలో లేదన్నారు. కులమతాలు, పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ అర్హులందరికీ అందిస్తున్నారని చెప్పారు. ఎంత కష్టమైనా రాష్ట్ర ప్రభుత్వం కాంటాలు పెట్టి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని మొండికేస్తుందన్నారు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కావాలా.. మోటర్లకు మీటర్లు పెట్టే ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
ఆంధ్రాలో మీటర్లకు మోటర్లు పెడితే రైతులు ఏడుస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టనివ్వబోనని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారని అన్నారు. నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీంతో చివరి డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు అందుతోందని చెప్పారు. దామరంచ నుంచి చింతల నాగారం చెక్ డ్యాం వరకు బీటీ రోడ్డు వేసేందుకు రూ. 60 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమాల్లో ఆర్డీవో రాజాగౌడ్, సర్పంచ్ దొంతురం విఠల్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, వైస్ ఎంపీపీ కాశీరాం, జడ్పీటీసీ తనబుద్ది స్వరూప, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాశ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.