నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 20 : మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో రైతు మృతి సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటనకు సం బంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా మానికి చెందిన కుమ్మరి నల్ల పోశెట్టి (43) సోమవారం ఉదయం తన పొలానికి వెళ్లాడు. ఆయన పొలం పక్కన గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోతె శ్రీనివాస్ పొలం ఉన్నది. శ్రీనివాస్ తన పంటపొలానికి అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి పోశెట్టి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు అవు తుందని మోతె శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి మృతదేహాన్ని గ్రామ శివారులో ఉన్న నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడేశాడని ఆరోపిస్తున్నారు. సోమవారం నుంచి పోశెట్టి కోసం గాలించగా పొలం వద్ద చెప్పులు, ఇతర వస్తువులు కనిపించడంతో మోతె శ్రీనివాస్ తన భర్తను చంపాడని పోశెట్టి భార్య సుజాత, గ్రామస్తులు మంగళవారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి ఆత్మకూర్ గేట్‌కు చేరుకొని పోశెట్టి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై ఏఎస్సై ఉమేశ్ మాట్లాడుతూ సో మవారం ఉదయం నుంచి పోశెట్టి కనిపించడంలేదని భార్య సుజాత ఫిర్యాదు చేసిందన్నారు. తన భర్త పోశెట్టి మృత దేహాన్ని ఎంపీటీసీ శ్రీనివాస్ నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడేశాడని ఆరోపిస్తూ భార్య సుజాత కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆత్మకూర్ గేటు వద్ద ఆందోళన చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎల్లారెడ్డి దవాఖానకు తరలించామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని ఏఎస్సై తెలిపారు.