కోటగిరి, సెప్టెంబర్ 20 :ఎక్కడో విసిరేసినట్టు అడువులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు.. వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం… తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు. ఊరికి వెళ్లాలంటే కిలో మీటర్ల కొద్దీ చెమటలు కక్కుతూ నడువాలి.. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని గిరిజన తండాల జీవన చిత్రం. కానీ నేడు వాటి రూపమే మారిపోయింది. తండాలు స్వ యంపాలనకు వేదికయ్యాయి. ప్రతి ఇంటినీ మిషన్ భగీరథ పలకరిస్తుంది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఊరి బయట వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం,డంపింగ్ యార్డు వచ్చాయి. తండా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి ప్రతినెలా నిధులు మంజూరవుతున్నాయి.ఈ నిధులతో తండాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
కలలో కూడా ఊహించని ఈ మార్పు వెనుక ఉన్న ది సీఎం కేసీఆర్. ఏనాడు చూడని సింగారాలు సంతరించుకుని స్వయం పాలనతో ప్రగతిపథాన దూసుకుపోతున్నాయి. తండాల్లో నేడు గిరిజన బిడ్డలే పాలకులు… వాళ్లే పాలితులు. 2008 ఏప్రిల్ 11వ తేదీన నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు, నేటి సీఎం కేసీఆర్ చేసిన ప్రతిజ్ఞ ఫలితం నేడు ప్రతి తండాలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ‘ఆపన్ తండేమ ఆపనో రాజ్’ పేరిట మన తండాలో మనరాజ్యం రావాలని కోరిన గిరిజనులకు ఆనాడు అభయమిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత వారి కలను సాకారం చేశారు. ఒకనాడు ప్రధాన గ్రామ పంచాయతీకి అనుసంధాన పల్లెలుగా ఉండి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తండాలు నేడు సకల సౌకర్యాలతో గ్రామ పంచాయతీలుగా వర్ధిల్లుతున్నాయి.
జిల్లాలో పంచాయతీలుగా మారిన 71 తండాలు..
500 జనాభా ఉన్న తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా చేసింది. ఈ లెక్కన రెండు మూడు తండాలను కలిపి జిల్లాలో మొత్తం 71 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి.
వికసిస్తున్న తండాలు..
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజన తండాలు పంచాయతీలుగా మారిన తరువాత అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. పంచాయతీలుగా మారిన 71 తండాలలో నేడు గిరిజనులే సర్పంచులయ్యారు. సుమారు 600 మంది వరకు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. సర్పంచులు, వార్డు సభ్యులుగా గిరిజనులే ఎన్నికై స్వపరిపాలన చేసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శి ఒక్కో తండాలో ఇద్దరి నుంచి ముగ్గురి వరకు మల్టీపర్పస్ వర్కర్లు వచ్చారు. వీరందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. తండాల్లో అభివృద్ధి పరుగులు పెట్టేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే కారణమని గిరిజనులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
తండాల్లో అభివృద్ధి పనులు..
గతంలో తండాలకు నిధులు వచ్చేవి కావు. ప్రధాన గ్రామ పంచాయతీల్లోని పనులకే ప్రాధాన్యమిచ్చేవారు. శివారు గ్రామాలుగా ఉన్న తండాల అభివృద్ధిని పట్టించుకునేవారు కాదు. తండాలు పంచాయతీలుగా మారిన తరువాత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, ఒక్కో పంచాయతీకి ట్రాక్టర్ సహా అనేక వనరులు సమకూరాయి. వీటి కోసం ప్రభుత్వం ప్రతి తండాకు రూ. కోట్లలో నిధులు మంజూరు చేసింది. ఇవే కాకుండా ప్రభు త్వం ప్రతినెలా పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నది. వీటిలో తండాలో కావాల్సిన అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు తండాల్లోనే ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో స్థానికులకు తండాల్లోనే ఉపాధి పనులు లభించను న్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తండాల ప్రజలు మంచినీటికి నానా అవస్థలు పడేవారు. నేడు మిషన్ భగీరథ పుణ్యమా అని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది.
పశువుల కాపరిగా పని చేసేవాడిని..
నేను వర్ని మండలంతో పాటు ఆయా చోట్ల కూలీ పనులు, చివరకు పశువుల కాపరిగా కూడా పని చేసేవాడిని. కేసీఆర్ సీఎం అయిన తరువాత లంబాడ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో నేను సర్పంచ్‌గా నామినేషన్ వేశాను. తండా ప్రజలు నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కేసీఆర్ కృషితోనే తండాలకు నిధులు మంజూరై అభివృద్ధి చెందుతున్నాయి.
– కిషన్ నాయక్, సర్పంచ్ సుద్దులం తండా,కోటగిరి మండలం
పంచాయతీగా మారిన తరువాతే అభివృద్ధి..
మా తండా ఇంతకు ముందు కొత్తపల్లి గ్రా మ పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన తరువాతనే తండాలో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రతి నెలా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతున్నాయి. తండాలో సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామం, సీసీ డ్రైనేజీలు, ప్రహరీ నిర్మాణం, చెత్త సేకరణకు, మొక్కలకు నీళ్లు పట్టడానికి ట్రాక్టర్ మంజూరైంది.
–శాంతాబాయి, సర్పంచ్ దేవునిగుట్టతండా,కోటగిరి మండలం
స్వయం పాలన వచ్చింది..
సీఎం కేసీఆర్ కృషితోనే గిరిజనులకు స్వయంపాలన వచ్చింది. గిరిజనులే సర్పంచ్‌గా ఎన్నికై సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తండాలు గ్రామ పంచాయతీలుగా చేయడంతో నిధులు నేరుగా తండాలకు వస్తున్నాయి. దీంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామపంచాయతీల్లో గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయి. పల్లెప్రగతితో తండాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని తండాలకు నిధులు మంజూరు చేశారు. తండాల తరపున సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రుణపడి ఉంటాం.
– బర్మవత్ వివేక్నాయక్, సర్పంచ్ జల్లాపల్లి ఆబాది,కోటగిరి మండలం.