బాన్సువాడ రూరల్, మార్చి 11 : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రాథమిక పాఠశాలను డీఈవో మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం తదితర విషయాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో పాఠ్యపుస్తకాలను చదివించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంపై డీఈవో సీరియస్ అయ్యారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలని ఎంఈవో నాగేశ్వరరావుకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్య భద్రతకు ప్రత్యేకచొరవ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.