కామారెడ్డి, సెప్టెంబర్ 29 : కామారెడ్డి జిల్లాలో గులాబ్ తుఫాన్ కారణంగా నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలతో వివిధ పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో వరి, సోయా, మక్కజొన్న, కంది తదితర పంటలు నీట మునిగాయి. జిల్లావ్యాప్తంగా 14 ఇండ్లు ధ్వంసమయ్యాయి. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు పంటలు,ఆస్తి నష్టంపై తుది నివేదిక సిద్ధం చేశాయి. జిల్లా వ్యా ప్తంగా 5,920 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 2,110, సోయాకు 3,810 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. బిచ్కుంద మండల పరిధిలోని 7 గ్రామాల్లో 770 ఎకరాల్లో వరి, 2200 ఎకరాల్లో సోయా పంట నష్టపోయింది. బిచ్కుంద, రాజుల్ల, మిషన్కల్లాలి, గుండె కల్లూర్, శెట్లూర్, హస్గుల్ గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బిచ్కుంద పరిధిలో 842 మంది, జుక్కల్ మండలంలో 685 మంది రైతుల పంటలకు నష్టం జరిగింది. జుక్కల్ మండలంలో 6 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా నాగిరెడ్డిపేట మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాగిరెడ్డిపేట మండలంలోని 7 గ్రామాల పరిధిలో 1340 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. పంట నష్టంపై ప్రభుత్వానికి పంపేందుకు నివేదికను సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి తెలిపారు.