లబ్ధిదారుల సంబురాల మధ్య ‘డబుల్బెడ్రూం ఇండ్ల’ ప్రారంభం
కారేగాం, లక్ష్మాపూర్‌లో రెండుపడకల ఇండ్ల సముదాయాలను ప్రారంభించిన స్పీకర్ పోచారంమేడిపల్లిలో శంకుస్థాపన
గిరిజనులతో నృత్యం చేసిన సభాపతి
చందూర్ మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం పండుగలా జరిగింది. నూతన గృహప్రవేశాలతో లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలారు. సంబురాల మధ్య కొత్తింట్లోకి అడుగుపెట్టారు. కారేగాం, లక్ష్మాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. దగ్గరుండి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. మేడిపల్లిలో 45డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శాసన సభాపతి భూమిపూజ చేశారు. గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణానికీ శంకుస్థాపన చేశారు.
చందూరు, ఆగస్టు 28: డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవాలు పండుగలా నిర్వహించారు. నూతన గృహప్రవేశాలతో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మండలంలోని లక్ష్మాపూర్ , కారేగాం, మేడ్‌పల్లి గ్రామాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో సందడిగా మారాయి. మండలంలోని కారేగాం, లక్ష్మాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇం డ్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించి, వారితో ముచ్చటించారు. కారేగాంలో కోటి రూపాయలతో బ్రిడ్జి, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అక్కడ నుంచి లక్ష్మాపూర్ గ్రామానికి చేరుకొని 53 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించి, కొత్తగా 30 ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ, పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మేడ్పల్లిలో సీసీ రోడ్డుతోపాటు 45 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మాపూర్, కారేగాంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. కారేగాం గ్రామానికి తాను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు గిరిజనులు ఎడ్ల బండి పై చొప్ప వేసుకుని కనిపించేవారన్నారు. వారిని ఆపి మక్కజొన్న పంట అప్పుడే కోతకు వచ్చిం దా అని అడిగితే నీరు లేక పంట ఎండిపోయిందని, కోసి పశువుల కోసం తీసుకెళ్తున్నామని సమాధానం ఇవ్వడంతో తాను చలించిపోయినట్లు గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు రూ. 106 కోట్లతో చందూర్ , జాకోరా లిప్టులు మంజూరయ్యాయని, త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుందామన్నారు. టెండర్లు పూర్తి చేసుకుని ఆరు నెలల్లో పనులు పూర్తిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌కు నీటి మళ్లించి భూములను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందించామన్నారు. అవసరమైతే మరో ఐదు వేల ఇండ్లను సీఎంతో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు. ఏ ఒక్కనిరు పేద అద్దె ఇం ట్లో ఉండరాదన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, సీఐ అశోక్, ఎస్సైలు అనిల్ రెడ్డి, రవీందర్, తహసీల్దార్ వసంత, ఎంపీడీవో నీలావతి, జడ్పీ టీసీ అంబర్ సింగ్, ఎంపీపీ లావణ్య, ఎంపీటీసీ శ్యాంరావ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూడ్ అం బర్ సింగ్, హన్మంత్ రెడ్డి, సంజీవ్, సర్పంచులు సాయా రెడ్డి, బోడ్డోల్ల సత్యనారాయణ, దేవీసింగ్, లకావత్ రవి, రాజారెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.