ప్రత్యేక యాప్ ఏర్పాటు
బ్లాక్స్పాట్ల గుర్తింపునకు దోహదం: సీపీ కార్తికేయ
ఇందూరు, ఆగస్టు 28: రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఐటీ మద్రాసుతో పాటు జాతీయ సమాచారం కేంద్రం సంయుక్తంగా ఇంటిగ్రేటేడ్ రోడ్డు యాక్సిడెంట్ డేటాబేస్ ప్రాజెక్టు (ఐరాడ్) యాప్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాక్సిడెంట్ల స్పాట్ వివరాలను ఎప్పటికప్పుడు ఇందులో అప్లోడ్ చేయాలని సూచించారు. వాహనం ఎంత జాగ్రత్తగా నడిపినా ఎదురు వారి అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.అతివేగం, నిబంధనలు పాటించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థ ఐరాడ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకవచ్చారని తెలిపారు. రోడ్డు ప్రమాద ప్రాంతాల సమాచారాన్ని పోలీసుశాఖ ఎప్పటికప్పుడు సేకరిస్తుందన్నారు. ప్రమాదస్థలం ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, నిత్యం ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, కారణమేమిటో అంశాలను పరిశీలించాలని, పోలీసు టెక్నికల్ టీమ్ ద్వారా అన్ని పోలీస్స్టేషన్లలో సిబ్బందికి శిక్షణనిస్తున్నట్లు వివరించారు. వారం రోజుల్లో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పూర్తి స్థాయిలో యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. జిల్లా పరిధిలో ఐరాడ్ ప్రాజెక్టు రోల్ అవుట్ మేనేజర్‌గా వర్షానిహాల్ వ్యవహరిస్తున్నారని తెలిపారు.